మద్యం మత్తులో నిజం కక్కేసి.. కటకటాలపాలైన హంతకుడు

  • 1993లో లోనావాలాలో వృద్ధ జంట హత్య
  • ముగ్గురు హంతకుల్లో ఇద్దరు అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితుడు
  • 30 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన వైనం
మద్యం మత్తులో ముప్పయ్యేళ్ల నాటి విషయాన్ని బయటపెట్టిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. అతివిశ్వాసంతో గతంలో తను చేసిన నేరాన్ని తనే బయటపెట్టాడు. దీంతో మూడు దశాబ్దాల నాటి జంట హత్యల కేసు చిక్కుముడి వీడింది. హత్య చేసిన విధానాన్ని స్వయంగా హంతకుడే బయటపెట్టడంతో పోలీసులు ఆధారాలు సేకరించి, నిందితుడిని కోర్టు ముందు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముంబైలో 1993లో జరిగిన హత్య కేసుకు ఇన్నాళ్లకు మోక్షం కలిగింది.

1993 అక్టోబర్ లో లోనావాలాలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. వృద్ధ దంపతులను చంపేసి, ఇంటిని దోచుకున్నారు. పోలీసుల విచారణలో అవినాశ్ పవార్ (19) మరో ఇద్దరితో కలిసి ఈ హత్యలకు పాల్పడ్డాడని తేలింది. మిగతా ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. అయితే, పవార్ మాత్రం దొరకలేదు. ముంబైలో ఉంటున్న తల్లికి కూడా చెప్పకుండా ఢిల్లీకి పారిపోయాడు. పేరు మార్చుకుని కొన్నాళ్లు గడిపాక మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు నివాసం మార్చాడు. అమిత్ పవార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి అహ్మద్ నగర్ కు చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్లు గడిపాక తిరిగి ముంబైకి వచ్చి విఖ్రోలిలో కొత్త పేరుతో పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు.

ముప్పయ్యేళ్లు గడిచిపోయాయి.. పవార్ వయసు ఇప్పుడు 49 ఏళ్లు. ఇన్నేళ్లు గడిచినా పోలీసులు తనను పట్టుకోలేక పోయారనే నమ్మకం పవార్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ను నింపింది. దీంతో తన తెలివితేటలపై నమ్మకంతో ఇటీవల తన పరిచయస్తుడి దగ్గర నోరుజారాడు. మద్యం మత్తులో 30 ఏళ్ల కింద తను చేసిన జంట హత్యల విషయాన్ని బయటపెట్టాడు. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవచ్చో తనకు బాగా తెలుసంటూ బడాయికి పోయాడు. ఇది కాస్తా ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. ఇంకేముంది వారు వెతుక్కుంటూ వచ్చి అవినాశ్ పవార్ ను పట్టుకుపోయారు.


More Telugu News