30 ఏళ్ల కిందట జంట హత్యలు చేసిన విషయాన్ని మద్యం మత్తులో కక్కేశాడు!

  • 1993లో లోనావాలలో జంట హత్యలు
  • దంపతులను కిరాతకంగా హత్య చేసిన అవినాశ్ పవార్
  • ఢిల్లీకి పారిపోయిన నిందితుడు
  • మారుపేరుతో పెళ్లి చేసుకుని భార్యను రాజకీయాల్లో దింపిన వైనం
  • ఓ మందు పార్టీలో నిజాన్ని వెల్లడించి కటకటాల వెనక్కి చేరిన నిందితుడు
మహారాష్ట్రలో మూడు దశాబ్దాల కిందట జరిగిన జంట హత్యల కేసులో నిందితుడు ఇన్నాళ్లకు దొరికాడు. అది కూడా, తాను హత్యలు చేశానని స్వయంగా నిందితుడు మద్యం మత్తులో వెల్లడించడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. 

అవినాశ్ పవార్ ముంబయి సమీపంలోని లోనావాలాలో ఓ దుకాణం నిర్వహించేవాడు. అక్కడికి దగ్గర్లోని ఓ దంపతుల ఇంటిపై అతడి కన్ను పడింది. మరో ఇద్దరితో కలిసి ఆ ఇంటిని కొల్లగొట్టేందుకు రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో అవినాశ్ పవార్, మరో ఇద్దరు సహచరులు కలిసి ఆ దంపతులిద్దరినీ కిరాతకంగా హతమార్చారు. 

పోలీసులు పట్టుకుంటారన్న భయంతో అవినాశ్ పవార్... ఢిల్లీకి పారిపోయాడు. అక్కడ కొన్నాళ్లు ఉన్న తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు తిరిగొచ్చాడు. తన పేరును అమిత్ గా మార్చుకుని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందాడు. అటు తిరిగి ఇటు తిరిగి ముంబయి వచ్చేశాడు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కొత్త పేరుతో విక్రోలీ ప్రాంతంలో  స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. పెళ్లి చేసుకుని భార్యను రాజకీయాల్లోకి దింపాడు. అమిత్ పవార్ అనే పేరుతో అతడు ఆధార్ కార్డు కూడా పొందాడు. 

అయితే, 30 ఏళ్ల పాటు తనను ఎవరూ పట్టుకోలేకపోయారన్న ధీమాతో అతడు ఓ మందు పార్టీలో అసలు విషయం కక్కేశాడు. ఈ విషయం ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన దయానాయక్ కు తెలియడంతో, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అవినాశ్ పవార్ అలియాస్ అమిత్ పవార్ ను అరెస్ట్ చేశారు.


More Telugu News