విధానకర్తలు సంప్రదాయ పద్ధతిలో ఆలోచిస్తే ఏమీ సాధించలేరు: చంద్రబాబు

  • హైదరాబాదులో GFST సదస్సు
  • చైర్మన్ హోదాలో హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు
  • డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై ప్రసంగం
  • మొదటిసారి సీఎం అయినప్పుడే ఐటీకి ఉన్న అవకాశాలను గుర్తించానని వెల్లడి
హైదరాబాదులో నిర్వహించిన GFST (Global Forum for Sustainable Transformation) సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు  GFST చైర్మన్ హోదాలో ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై చర్చించారు. 

స్పాట్ ఫ్లోక్ సీఈఓ శ్రీధర్ శేషాద్రి, గో నార్త్ వెంచర్స్ సీఈఓ సంజయ్ జస్రాని, ఇ అండ్ వై డైరెక్టర్ శ్రీరాం అయ్యర్, ఇ అండ్ వై పార్టనర్ రాందేశ్ పాండే, విజ్ గ్లోబల్ హెడ్ సతీష్ లక్కరాజు ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. మారిటైం గేట్ వే పబ్లిషర్ రాంప్రసాద్ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. టెక్నాలజీ సమర్థంగా వినియోగించుకుంటే వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలు... ఎవరైనా మంచి ఫలితాలు పొందుతారని పేర్కొన్నారు. తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలో భవిష్యత్ లో ఐటీలో ఉన్న అవకాశాలను గుర్తించానని తెలిపారు. 

చంద్రబాబు ప్రసంగం హైలైట్స్...

 హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టడంతో పాటు... ప్రపంచ వ్యాప్తంగా తిరిగి వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడాను.
 ఇండియన్స్ కు ఉన్న సమర్థతల గురించి విస్తృతంగా ప్రచారం చేశాను. కంపెనీలకు ఇక్కడ ఉన్న మానవ వనరుల గురించి చెప్పాను.
 ఇండియన్స్ కు ఇంగ్లీష్ లో, మ్యాథ్స్ లో ఉన్న సమర్థత గురించి వివరించాను.
 అదే సమయంలో ట్రిపుల్ ఐటీతో సహా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించాను.
 తద్వారా పెద్ద ఎత్తున ఐటీ రంగ నిపుణులు అందుబాటులోకి వచ్చారు.

 అయితే కొన్ని సమస్యలు తీవ్ర ఇబ్బందికరంగా ఉండేవి.
 నాడు ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి అంటే కూడా గంటలు, రోజులు పట్టేది... ఇవన్నీ కంపెనీల ఏర్పాటుకు ఆటంకాలుగా ఉండేవి.
 అప్పుడే ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి డీ రెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ విధానాన్ని తీసుకువచ్చాను. సెల్ ఫోన్ ల రాకకు నాంది పడింది. తద్వారా ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
 బిల్ గేట్స్ తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను తీసుకువచ్చాను.

 నాడు ఐటీ విప్లవాన్ని తెలుగు జాతి సమర్థవంతంగా ఉపయోగించుకుంది.
 మరోవైపు మెరికల్లాంటి యువత అవకాశాలను అందిపుచ్చుకుని దేశ విదేశాల్లో విస్తరించారు.
 నేడు విదేశాల్లో నాలెడ్జ్ ఎకానమీ ద్వారా భారతీయులు, తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగిగా ఉన్న సత్య నాదెళ్ల నేడు ఆ సంస్థకు సీఈవో అయ్యారు.

 ఇప్పుడు టెక్నాలజీ ఉన్నత స్థితిలో ఉంది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
 పేదరిక నిర్మూలనకు సాంకేతికతను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది చర్చించాలి. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి కృషి జరగాలి. ఇటువంటి సదస్సులు, GFST వంటి వేదికలు దానికి ప్రణాళికలు రూపొందించాలి.
 1991లో తెలుగు వ్యక్తి, నాటి ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలు ద్వారా దేశం అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది.

 నేను ముఖ్యమంత్రి అయిన తరువాత పీపీపీ విధానాన్ని ప్రమోట్ చేశాను.
 మలేషియాలో రోడ్లు చూసి జాతీయ రహదారుల నిర్మాణానికి నాటి ప్రధానికి ప్రతిపాదనలు ఇచ్చాను. కేంద్రం డబ్బులు వెచ్చించే అవసరం లేకుండా రోడ్ల నిర్మాణంపై ప్రతిపాదనలు ఇచ్చి ప్రధానిని ఒప్పించాను.
 స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ద్వారా తడ నుంచి చెన్నై వరకు మొట్టమొదట పీపీపీ విధానంలో రోడ్లు వేశాం.
 తరువాత కాలంలో ఈ విధానంతో జాతీయ రహదారుల రూపురేఖలే మారిపోయాయి.
 ఇదే విధానాన్ని రాష్ట్ర రహదారుల నిర్మాణంలో కూడా తీసుకువచ్చాం. మంచి ఫలితాలు వచ్చాయి.

 అనేక సవాళ్లను ఎదుర్కొని విద్యుత్ రంగంలో సంస్కరణలను తీసుకువచ్చాను.
 టెక్నాలజీ కారణంగా ఎండ్ల బండ్ల నుంచి డ్రైవర్ లెస్ కార్ ల వైపు మనం ప్రయాణం చేస్తున్నాం.
 టెక్నాలజీ, పాలసీల సమర్థ అమలు ద్వారా పేదరికం లేని సమాజం నిర్మించవచ్చు. సమాజంలో సమూల మార్పులు తేవచ్చు. అదే నా జీవిత లక్ష్యం.
 భారత దేశానికి ఉన్న అనేక బలాల కారణంగా 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా మారుతుంది.

 పాలసీ మేకర్స్ సంప్రదాయ పద్ధతుల్లో ఆలోచిస్తే మంచి ఫలితాలు రావు
 చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి సాంకేతికతను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
 మితిమీరిన టెక్నాలజీ వల్ల ఉద్యోగ భద్రతకు ప్రమాదం అనే వాదన తప్పు.
 ఉద్యోగ కల్పనలకు సాంకేతికత కొత్త మార్గాలను, అవకాశాలను సృష్టిస్తుంది.
 ఇటువంటి టెక్నాలజీ వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి అని వాటిని మనం దూరంగా పెట్టలేం. వాటిని నిలువరించే ప్రయత్నం చేసినా అది ఫలించదు.

 బయోటెక్నాలజీని నేను ప్రమోట్ చేసినప్పుడు కూడా అనేక ప్రశ్నలు వేశారు. కానీ నాడు దాన్ని ప్రమోట్ చేయడం వల్లనే నేడు కోవిడ్ కు వ్యాక్సిన్ తీసుకురాగలిగారు.
 నేను విజనరీగా ఉండడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. కానీ నన్ను అప్పుడు అర్థం చేసుకోకపోవడం వల్ల రాజకీయంగా నష్టం జరిగింది.
 పాలసీల ద్వారా లబ్దిపొందిన వర్గాలు, ప్రజలు... సమాజానికి తిరిగి ఇవ్వడంలో భాగస్వాములు కావాలి.
 కానీ ఎందుకో, లబ్ది పొందిన ఆయా వర్గాలు ఆ మేరకు చొరవ చూపడం లేదు.

 డిజిటల్ కరెన్సీ రావాలి అనేది నా బలమైన కోరిక. పెద్ద నోట్లను రద్దు చేయాలి. తద్వారా మనీ లాండరింగ్, బ్లాక్ మనీ సహా అన్నిటికీ చెక్ పడుతుంది.
 అప్పుడు ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా పేద ప్రజలపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టవచ్చు.
 సమర్థవంతమైన నాయకత్వంతోనే కుటుంబంలో అయినా, రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా మార్పు వస్తుంది.
 రాజకీయాల్లోకి మంచి వ్యక్తులు రావాలి. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలి.
 ఓటింగ్ పెరగడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. తద్వారా దేశానికి మంచి నాయకత్వం అందుతుంది. మంచి ఫలితాలు వస్తాయి.

 పూర్ టు రిచ్ అనేది నా మనసుకు దగ్గరైన కార్యక్రమం.
 నాడు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ అనేది ఉంది. ఇప్పుడు నేను పీ-4 అంటున్నాను. అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అనేది రావాలి. సంపద సృష్టే కాకుండా దాన్ని అన్ని వర్గాలకు పంచేలా పాలసీలు ఉండాలి. తద్వారా పేదలు ధనికులుగా మారుతారు.
 పీ-4 వంటి విధానాలతో ఇండియా 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్ లేదా నెంబర్ టు దేశంగా నిలుస్తుంది.

 పేదలకు అండగా నిలవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాలి. అందుకు అవసరమైన పాలసీలు ప్రభుత్వాలు తీసుకురావాలి. తద్వారా పేదరికం లేని సమాజం సిద్ధిస్తుంది.
 సాంకేతికత మిళితంగా వివిధ రంగాలకు సంబంధించి 10 పబ్లిక్ పాలసీలు తీసుకురావాలి.
 ఆరోగ్యం, విద్య, విద్యుత్, వ్యవసాయం, ఏఐ, ఐఓటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సర్వర్ పాలసీ వంటి రంగాల్లో కొత్త పాలసీల రూపకల్పన జరగాలి.


More Telugu News