వివాహేతర సంబంధాలున్నాయా... అయితే పీకిపడేస్తాం!: ఉద్యోగులకు చైనా కంపెనీ హెచ్చరిక

  • ఉద్యోగుల పర్సనల్ విషయాలపై చైనా సంస్థ కఠిన వైఖరి
  • తప్పుడు మార్గంలో వెళితే ఇంటికి పంపిస్తామని వార్నింగ్
  • ఉద్యోగుల కోసం నాలుగు మార్గదర్శకాలు జారీ చేసిన కంపెనీ
ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లదు. అయితే పనితీరులో ఎలాంటి ఉదాసీనత లేకుండా, సంస్థ అభివృద్ధి కోసం పాటుపడాలని కంపెనీలు ఆశిస్తాయి. కానీ, ఈ చైనా కంపెనీ మాత్రం ఉద్యోగుల పర్సనల్ విషయాలపైనా కఠినంగా వ్యవహరిస్తోంది. 

పెళ్లయిన ఉద్యోగులు అక్రమ సంబంధాల జోలికి వెళితే ఉద్యోగం నుంచి పీకిపడేస్తాం ఖబడ్దార్ అంటూ సీరియస్ వార్నింగ్ లు ఇస్తోంది. జెజియాంగ్ నగరంలోని ఈ కంపెనీ తమ ఉద్యోగులను వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. 

"కంపెనీ అంతర్గత నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, కుటుంబం పట్ల విధేయతతో, భార్యాభర్తల మధ్య ప్రేమ కోసం, పనిపై దృష్టి పెట్టడం కోసం, వివాహితులైన అందరు ఉద్యోగులు వివాహేతర సంబంధాలు కలిగి ఉండడాన్ని నిషేధించడమైనది" అంటూ ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. అందుకోసం నాలుగు సూత్రాలను కూడా ప్రకటించింది. 1. అక్రమ సంబంధాలు వద్దు 2. ఉంపుడుగత్తెలు వద్దు 3. వివాహేతర సంబంధాలు వద్దు 4. విడాకులు వద్దు... ఈ నాలుగు  మార్గదర్శకాలతో తమ ఉద్యోగులు ఏకపత్నీవ్రతుల్లా వెలిగిపోతూ, తమ పనితీరుతో సంస్థకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నట్టు సదరు సంస్థ పేర్కొంది. అయితే ఆ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.


More Telugu News