ఉగాండాలో స్కూల్‌పై దాడి... విద్యార్థులు సహా 26 మంది మృతి

  • డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు 1.2 మైళ్ల దూరంలోని స్కూల్లో ఘటన
  • అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ తిరుగుబాటు గ్రూప్ ఈ దాడికి కారణం
  • హాస్టల్ ను తగులబెట్టి ఆహారాన్ని దోచుకున్నట్లు పోలీసుల వెల్లడి
ఉగాండాలో దారుణం జరిగింది. ఓ పాఠశాలలో శుక్రవారం జరిగిన దాడిలో 25 నుండి 26 మంది మరణించగా, ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు 1.2 మైళ్ల దూరంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ దారుణానికి... అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) తిరుగుబాటు గ్రూపు కారణమని పోలీసులు తెలిపారు.

దుండగులు వసతి గృహాన్ని తగులబెట్టి ఆహారాన్ని దోచుకున్నట్లు చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడినవారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. యుపిడిఎఫ్ (ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్), పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు ఇక్కడి విరుంగా నేషనల్ పార్కు దిశగా పారిపోయినట్లు గుర్తించి, ఆ దిశగా వారిని వెంబడిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

మృతి చెందిన వారి కుటుంబాలకు పోలీసులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. కొంతమందిని దుండగులు ఎత్తుకుపోయినట్లుగా తెలుస్తోంది.

ఉగాండా ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో 1995లో కాంగోలోని ఉగాండా ప్రవాసులు ADFని ఏర్పాటు చేశారు. 2001లో ఉగాండా ఎదురుదాడితో వారు తూర్పు కాంగోలోకి పారిపోయి అక్కడి నుండి హింసకు తెగబడుతున్నారు. ADFకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. ADFను తిరుగుబాటుదారులను అణిచివేసేందుకు ఉగాండా ప్రభుత్వం వైమానిక, ఫిరంగి దాడులు చేపడుతోంది. ఐక్య రాజ్య సమితి 2020లో ADFను హింసాత్మక  గ్రూప్ గా పేర్కొంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ప్రకారం, యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 2021లో ADFని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థగా అలాగే విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా పేర్కొంది.


More Telugu News