బంగ్లా క్రికెట్ టీమ్ సరికొత్త చరిత్ర.. 21వ శతాబ్దంలోనే అతిపెద్ద విజయం!

  • బంగ్లాదేశ్‌, ఆఫ్ఘన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్
  • 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి, 115 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘన్ ‌
  • 546 పరుగుల భారీ తేడాతో గెలిచిన బంగ్లా
  • టెస్టు చరిత్రలో ఇదే మూడో అతిపెద్ద విజయం
బంగ్లాదేశ్‌ క్రికెట్ టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్థాన్‌ తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తద్వారా 21వ శతాబ్దంలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్‌ జట్టు 115 పరుగులకే కుప్పకూలి అప్రతిష్ఠను మూటగట్టుకుంది.

టెస్టు క్రికెట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌ జట్టుకు ఇదే అతిపెద్ద విజయం కాగా.. ఓవరాల్‌గా మూడో అతిపెద్ద గెలుపు. 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ 675 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో ఉంది. 1934లో 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.

ఇక ఏకైక టెస్టు మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ 146 పరుగులకే కుప్పకూలింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లా.. 425 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. నజ్ముల్‌ హుసేన్ షాంటో రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు (146 పరుగులు, 124 పరుగులు) నమోదు చేశాడు. మోమినుల్‌ హక్‌ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ (121 పరుగులు నాటౌట్‌) చేశాడు.

662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. అత్యధిక పరుగులు 30. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లు తీయగా.. షోరిఫుల్‌ ఇస్లామ్‌ మూడు, మెహిదీ హసన్‌ మిరాజ్‌, ఎబాదత్‌ హొసెన్‌లు చెరొక వికెట్‌ పడగొట్టారు.


More Telugu News