పాలు తాగట్లేదని 5 రోజుల పసికందుపై తల్లి దారుణం!

  • ఉత్తరప్రదేశ్ బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామంలో వెలుగు చూసిన ఘటన
  • అకస్మాత్తుగా తల్లిపాలు తాగడం మానేసిన శిశువు
  • శిశువు వేళ్లను వేడి నూనెలో ముంచితే పరిస్థితి చక్కబడుతుందని ఆరోగ్య కేంద్రం సిబ్బంది సలహా 
  • ఈ సూచనను యథాతథంగా అమలు చేసిన తల్లి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆరోగ్య కేంద్రం వైద్యుడు
అయిదు రోజుల వయసున్న శిశువు పాలు తాగడం లేదని ఆందోళన చెందిన ఓ మహిళ మూఢనమ్మకాలతో దారుణానికి ఒడిగట్టింది. చిన్నారితో మళ్లీ పాలు తాగించేందుకు శిశువు చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా దంపతులకు ఈ నెల 11న ఫతేపూర్ ఆరోగ్య కేంద్రంలో పండంటి బిడ్డ పుట్టాడు. మొదటి మూడు నాలుగు రోజులు బాగానే ఉన్న చిన్నారి ఆ తరువాత తల్లి దగ్గర పాలు తాగడం మానేసింది. దీంతో, ఆసియా తీవ్ర ఆందోళనకు గురైంది. 

సమస్యను పరిష్కరించేందుకు చిన్నారి వేళ్లను వేడి నూనెలో ముంచాలని ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది ఒకరు దారుణమైన సలహా ఇచ్చారు. అప్పటికే ఆసియా ఓ బిడ్డను కోల్పోయింది. పుట్టిన కొన్ని రోజులకు పాలు తాగడం మానేసిన బిడ్డ ఆ తరువాత మృతి చెందింది. దీంతో, ఈ చిన్నారి కూడా తనకు దూరం అవుతుందనే భయంతో ఆసియా ఆ సలహాను యథాతథంగా పాటించింది. విధుల్లో ఉన్న ఓ నర్సు ఈ విషయాన్ని గుర్తించి వైద్యుడికి ఫిర్యాదు చేసింది. వైద్యుడు చిన్నారికి వెంటనే వైద్యం అందించి, ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.


More Telugu News