కొడుకులు తన పెద్దకర్మ చేస్తారో.. లేదోనని.. బతికుండగానే ముచ్చట తీర్చుకున్న తండ్రి!

  • ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో ఘటన
  • మూడు పెళ్లిళ్ల ద్వారా ఏడుగురు సంతానం
  • మూడేళ్ల క్రితమే సమాధి సిద్ధం చేసుకున్న వైనం
  • వారం రోజుల క్రితం పిండ ప్రదానం కూడా..
తాను చనిపోయిన తర్వాత పిల్లలు తనకు పెద్దకర్మ నిర్వహిస్తారో, లేదోనని మథనపడిన ఓ తండ్రి ఆ ముచ్చటను తానే తీర్చుకున్నాడు. ఊరందరినీ పిలిచి ఘనంగా విందు ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెవానా గ్రామానికి చెందిన జఠాశంకర్ వయసు 60కిపైనే. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతడికి ఏడుగురు సంతానం. ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ తాను చనిపోతే పిల్లలు తనకు పెద్దకర్మ నిర్వహిస్తారో.. లేదోనన్న బెంగ మొదలైంది. 

ఇలా బెంగపడుతూ కూర్చుంటే లాభం లేదనుకున్నాడు. గురువారం రాత్రి చుట్టాలుపక్కాలతోపాటు గ్రామస్థులందరినీ పిలిచి తన పెద్దకర్మను తానే నిర్వహించుకున్నాడు. వచ్చిన 300 మందికి స్వయంగా వడ్డించాడు. బతికి ఉండగానే పెద్దకర్మ నిర్వహించడం మన ఆచారం కాదని తెలిసినా చేయకతప్పలేదని జఠాశంకర్ చెప్పుకొచ్చాడు. తనకు ఎవరి మీదా నమ్మకం లేదని, అందుకే ఈ కార్యక్రమానికి పూనుకున్నట్టు చెప్పాడు. 

మరో ముఖ్య విషయం ఏంటంటే.. మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో సమాధి సిద్ధం చేసుకున్నాడు. కొన్ని వారాల క్రితమే తనకు తానే పిండం కూడా పెట్టుకున్నాడు. విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే పెద్దకర్మ కూడా నిర్వహించుకుని మరో షాకిచ్చాడు.


More Telugu News