దశాబ్ది ఉత్సవాలు ఎందుకనే వారికి కేటీఆర్ సమాధానం ఇదే!

  • దశాబ్ది ఉత్సవాలు ఎందుకు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయన్న కేటీఆర్
  • సమగ్ర, సమతుల్య, సమీకృత, సమాన అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్య
  • భారత్ కు దిక్సూచిగా తెలంగాణ నిలిచిందన్న మంత్రి
ఈ తొమ్మిదేళ్లలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, అలా ప్రశ్నించే వారికి ఒక్కటే సమాధానమని, తెలంగాణలో సమగ్ర, సమతుల్య, సమీకృత, సమాన అభివృద్ధి జరుగుతోందని మంత్రి కేటీ రామారావు అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ మాట్లాడుతూ... తాను చూసే ఐటీ, పరిశ్రమల శాఖలు ఒక ఎత్తైతే, మున్సిపల్ శాఖ మరో ఎత్తు అన్నారు. ఐటీ రంగంలో ఎన్ని ప్రశంసలు వస్తాయో మున్సిపల్ శాఖలో అంత తక్కువ ప్రశంసలు వస్తాయన్నారు.

2021-22 తర్వాత తెలంగాణకు 12 అవార్డులు రాగా, 2022-23లో అందుకు రెండు రెట్లు ఎక్కువగా వచ్చాయన్నారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్నది ఎంత నిజమో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు పట్టణాలు అంతే ముఖ్యమన్నారు. పల్లెలు, పట్టణాలు రెండూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయన్నారు. ఇంత అభివృద్ధి ఎవరి వల్ల కాదని, దేశంలో నలభై శాతం ఐటీ ఉద్యోగాలు తెలంగాణ నుండే ఉన్నాయన్నారు. ఐటీ ఎగుమతులకు తోడు వ్యవసాయ ఎగుమతులు పెరుగుతున్నట్లు చెప్పారు. 

తొమ్మిదేళ్లలోనే భారత్ కే తెలంగాణ దిక్సూచిగా నిలవడానికి కేసీఆర్ సారథ్యం మాత్రమే కాదని, 
రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కారణమన్నారు. ఇప్పుడు తెలంగాణ చేసేది రేపు దేశం అనుసరిస్తుందన్నారు. మూసీ నదిపై భవిష్యత్తులో కొత్తగా 14 బ్రిడ్జిలు కట్టే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. ప్రతి పట్టణంలో మినీ స్టేడియం కట్టాలనే ఆలోచన ఉందన్నారు.


More Telugu News