చట్టబద్ధ శృంగారానికి కనీస వయో పరిమితిని పెంచిన జపాన్

  • ఇప్పటిదాకా జపాన్ లో చట్టబద్ధ శృంగారానికి కనీస వయసు 13 ఏళ్లు
  • 16 ఏళ్లకు పెంచాలన్న బిల్లుకు పార్లమెంటు ఆమోదం
  • దాంతో బాలల హక్కులకు మరింత భద్రత
  • 16 ఏళ్ల లోపు బాలికలతో లైంగిక చర్యలు ఇకపై అత్యాచారమే!
ఎంతో అభివృద్ధి చెందిన దేశం జపాన్ లో ఏళ్ల నాటి పాత చట్టాలను సంస్కరించే క్రమంలో కీలక ముందడుగు పడింది. దేశంలో చట్టబద్ధ శృంగారానికి కనీస వయసును 16 ఏళ్లకు పెంచాలన్న బిల్లుకు జపాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ వయసు 13 ఏళ్లుగా ఉండేది. 

పాత చట్టం ప్రకారం 13 ఏళ్లు దాటిన వారు జపాన్ లో చట్టబద్ధ శృంగారానికి అర్హులు. ప్రపంచంలోనే శృంగారానికి అత్యంత తక్కువ వయసు నిర్దేశించిన దేశం జపానే. అయితే, ఇప్పుడు సంస్కరణల పుణ్యమా అని కీలక బిల్లుకు చట్టసభ్యుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. పార్లమెంటు ఎగువ సభలో ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. 

ఇక నుంచి 16 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక చర్యలు శిక్షార్హం అవుతాయి. 16 ఏళ్ల లోపు ఉన్న బాలికలతో లైంగిక చర్యలు అత్యాచారంగా పరిగణింపబడతాయి. చట్టబద్ధ శృంగారానికి కనీస వయో పరిమితి బ్రిటన్ లో 16 ఏళ్లు కాగా, ఫ్రాన్స్ లో 15, జర్మనీలో 14, చైనాలో 14 ఏళ్లుగా ఉంది. 

జపాన్ లో ఇప్పటిదాకా ఉన్న 13 ఏళ్ల వయో పరిమితి 1907 నుంచి ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగింది. 13 ఏళ్లకు పైబడిన అమ్మాయిలతో శృంగారం అక్కడ నేరం కాదు. దాంతో బాలికలను బలవంతంగా వ్యభిచార రొంపిలో దింపినా ప్రశ్నించే వీలుండేది కాదు. ఇప్పుడా పరిస్థితి తొలగిపోనుంది. 

లైంగిక అవసరాలు తీర్చుకునేందుకు 16 ఏళ్ల లోపు బాలలను ఇకపై భయపెట్టి, మత్తులో దించి, డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తే ఏడాది వరకు జైలు శిక్ష, 5 లక్షల యెన్ల జరిమానా విధిస్తారు. బాలల మర్మాంగాలను చిత్రీకరిస్తే మూడేళ్ల జైలు, 30 లక్షల యెన్ల జరిమానా విధిస్తారు. 

జపాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని దేశంలోని పౌర సంఘాలు స్వాగతించాయి. టోక్యోకు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ దీన్నొక పెద్ద ముందడుగుగా అభివర్ణించింది.


More Telugu News