మా ప్రతిపాదనకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్.. బీసీసీఐ పరిస్థితిని అర్థం చేసుకున్నాం: పీసీబీ చీఫ్

  • ఆసియా కప్‌ 2023 నిర్వహణపై వచ్చిన క్లారిటీ
  • బీసీసీఐ పరిస్థితి కూడా తమ లాంటిదేనన్న పీసీబీ చీఫ్
  • పాక్‌లో ఆడేందుకు వారికి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ దక్కదని వ్యాఖ్య
  • తటస్థ వేదికగా శ్రీలంక ఉండనుందని వెల్లడి
సుదీర్ఘ గందరగోళం తర్వాత ఆసియా కప్‌ 2023 నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిపాదించిన హైబ్రీడ్‌ మోడల్ కు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ (ఏసీసీ) ఓకే చెప్పడంతో గురువారం సిరీస్ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో తమ ప్రతిపాదనను అంగీకరించిన ఏసీసీకి పీసీబీ చైర్మన్‌ నజమ్‌ సేథీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పీసీబీ షేర్‌ చేసింది. అందులో నజమ్‌ సేథీ మాట్లాడుతూ.. ఆసియా కప్ 2023 కోసం తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ వెర్షన్ ను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఆసియా కప్‌ హోస్ట్‌గా మేము ఉండడం, పాకిస్థాన్ కు టీమిండియా రాలేని కారణంగా శ్రీలంక తటస్థ వేదికగా ఉండనుందని తెలిపారు.

ఆసియా కప్‌ ద్వారా టీమిండియా పాకిస్థాన్‌లో అడుగుపెడుతుందని అనుకున్నామని, కానీ బీసీసీఐ పరిస్థితిని అర్థం చేసుకున్నామని చెప్పారు. ‘‘పీసీబీ మాదిరే బీసీసీఐ కూడా బార్డర్‌ దాటి వచ్చి పాక్‌లో ఆసియా కప్‌ ఆడేందుకు బీసీసీఐకి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌తో పాటు ఆమోదం కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదని తెలుసు. బీసీసీఐ పరిస్థితి మాకు అర్థమైంది. మా ప్రతిపాదనను అర్థం చేసుకున్న ఏసీసీకి కృతజ్ఞతలు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఆసియా కప్ కొనసాగనుంది. ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు.. శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, నేపాల్‌ జట్లు టైటిల్‌ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాక్, నేపాల్‌... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ జట్లున్నాయి.

గ్రూప్‌ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్‌ -4’కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత టాప్‌–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు.


More Telugu News