'ఆదిపురుష్'కు సీత కష్టాలు... నేపాల్ లో ప్రదర్శనకు అనుమతి నిరాకరణ!

  • ఈరోజు ఘనంగా విడుదలైన 'ఆదిపురుష్'
  • సీతాదేవి భారత్ లో పుట్టినట్టుగా సినిమాలో సన్నివేశం
  • సీత తమ దేశంలో పుట్టిందంటూ నేపాల్ అభ్యంతరం
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. సినిమాను వీక్షించేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. మరోవైపు నేపాల్ లో ఈ సినిమా విడుదలకు అనుమతిని నిరాకరించారు. ఈ చిత్రంలో సీత జన్మస్థలాన్ని తప్పుగా చూపించారని నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. తప్పును సరిదిద్దుకోకపోతే నేపాల్ రాజధానిలో ఏ హిందీ సినిమాను అనుమతించబోమని ఖాట్మండూ మేయర్ హెచ్చరించారు. 

ఈ సినిమాలో సీతాదేవి భారతదేశపు కుమార్తె అనే డైలాగ్ చెప్పేలా సన్నివేశం ఉంది. అయితే, సీతాదేవి నేపాల్ లో జన్మించిందనేది ఆ దేశ ప్రజల నమ్మకం. ఇదే వివాదానికి కారణం అయింది. సీతాదేవి భారత్ లో పుట్టినట్టుగా ఉన్న డైలాగ్ ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సినిమాను ప్రదర్శించనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషించగా, సీతామాత పాత్రలో కృతి సనన్ నటించారు.


More Telugu News