బావ కదా.. అప్పుడప్పుడూ ఏడిపిస్తుంటా: కేటీఆర్

  • సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
  • ఇద్దరు నేతల ఆత్మీయ ఆలింగనం, ఒకరిపై మరొకరు ప్రశంసలు
  • ఇతరులు అసూయపడేలా సిద్దిపేటను హరీశ్ రావు అభివృద్ధి చేశారని కేటీఆర్ వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో హరీశ్‌ను లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
మంత్రి హరీశ్ రావు తన బావ కాబట్టి అప్పుడప్పుడూ టీజ్ చేస్తూ ఉంటానని మంత్రి కేటీఆర్ తాజాగా అన్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో హరీశ్ అభివృద్ధి కాముకుడని కేటీఆర్ ప్రశంసించగా, తెలంగాణ గౌరవాన్ని అంతర్జాతీయంగా చాటుతున్న వ్యక్తి కేటీఆర్ అని హరిశ్ అభిప్రాయపడ్డారు. సభలో మంత్రులు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హరీశ్ రావు తన బావ కాబట్టి అప్పుడప్పుడూ సరదాగా ఏడిపిస్తుంటానని తెలిపారు. ‘‘నేను సిరిసిల్లకు సిద్దిపేట నుంచే పోవాలి. ఇక్కడకు రాగానే హరీశ్ రావుకు ఫోన్ చేస్తా. ఏం సంగతి బావా! మళ్లేదో కొత్తవి కట్టినట్టున్నవ్. కొత్త రోడ్లు వేసినవ్..అని అడుగుతా. దీనికి ఆయన స్పందిస్తూ.. ఇక లాభం లేదు. మళ్లోసారి వచ్చినప్పుడు కళ్లుమూసుకునిపో. ప్రతిసారీ ఏదో ఒకటి అంటున్నవ్ అంటూ సరదాగా బదులిస్తారు’’ అని కేటీఆర్ చమత్కరించారు. అందరూ అసూయపడేలా సిద్దిపేటను హరీశ్‌రావు అభివృద్ధి చేశారని, ఆయనను ఈసారి లక్షన్నర ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.


More Telugu News