అవన్నీ అపోహలే... ఎవరూ నమ్మవద్దు: నారా లోకేశ్

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యువగళం
  • ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • పాస్టర్లతో లోకేశ్ సమావేశం
  • తాము ఏ మతాన్ని చిన్న చూపు చూడబోమని స్పష్టీకరణ
  • జగన్ అపోహలు సృష్టిస్తున్నాడని విమర్శలు
యువత భవిత కోసమే నేను యువగళం మొదలుపెట్టాను... చంద్రబాబు గారి పాలనలో ఏపీ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంది, జగన్ పాలనలో ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం బొమ్మవరం క్యాంప్ సైట్ లో హలో లోకేశ్ పేరుతో యువతతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... పరిపాలన అంతా ఒకే చోట-అభివృద్ది వికేంద్రీకరణ తమ నినాదం అని వెల్లడించారు. "టీడీపీ అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది. విజనరీ పాలనలో హెచ్ సీఎల్, కాండ్యుయెంట్, కియా, టీసీఎల్, డిక్సన్ లాంటి కంపెనీలు వచ్చాయి. 

ప్రిజనరి పాలనలో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి. ఫాక్స్ కాన్, రిలయన్స్, అమర్ రాజా లాంటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. జగన్ ది ఫ్యాక్షన్ మెంటాలిటీ అందుకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంచి పని చెయ్యకుండా ప్రజా వేదిక కూల్చాడు" అని విమర్శించారు.

చర్చిల్లో విభేదాలు సృష్టించి లబ్దికి జగన్ యత్నం!

జగన్ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, చర్చిల్లో విభేదాలు సృష్టించి లబ్ది పొందాలని చూస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. బొమ్మవరం శివారు క్యాంప్ సైట్ లో పాస్టర్లతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మైనార్టీ కార్పొరేషన్ నుండి క్రైస్తవ కార్పొరేషన్ విభజిస్తేనే క్రైస్తవులకు న్యాయం జరుగుతుందని అన్నారు. 

"టీడీపీ హయాంలో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటుకి సహాయం చేసాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు కి సాయం చేస్తాం. చర్చిల నిర్మాణానికి సహాయం చేస్తాం. మౌలిక వసతులతో కూడిన ప్రత్యేక శ్మశానాలు ఏర్పాటు చేస్తాం. 

జెరూసలేం యాత్రకు సబ్సిడీ పెంచుతాం. హెల్త్ కార్డులు, చనిపోతే రూ.10 లక్షల ఆర్ధిక సాయం కుటుంబానికి అందిస్తాం. ఇండిపెండెంట్ చర్చిలు, పాస్టర్లకు గౌరవ వేతనం పక్కాగా అందిస్తాం. పాస్టర్లు పెళ్లిళ్లు చేసే విధంగా పర్మినెంట్ లైసెన్స్ ఇస్తాం. జగన్ తెచ్చిన మూడేళ్ల నిబంధన ఎత్తేస్తాం. 

బైబిల్ కాలేజ్ ఏర్పాటుకి సహకరిస్తాం. పాస్టర్లకు గుర్తింపు కార్డులు అందజేస్తాం. క్రిస్మస్ ఘనంగా జరిపేందుకు సహకరిస్తాం" అని హామీల వర్షం కురిపించారు.

టీడీపీ అందరిదీ!

"ఏ మతాన్ని మేము చిన్న చూపు చూడం. జగన్ సృష్టించే అపోహలు నమ్మొద్దు. దళిత క్రైస్తవులకు లబ్ది చేకూరేలా టీడీపీ గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. మొదటిసారి సీఎం అయినప్పుడే చంద్రబాబు గారు చర్చిల నిర్మాణానికి సహాయం చేశారు. పాస్టర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

జగన్ పాలనలో పాస్టర్లకి కనీస గౌరవం లేదు. జగన్ పాలనలో క్రైస్తవులు కూడా బాధితులే. జగన్ పాలనలో పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్ల సమస్యలు పరిష్కారం కోసమే టీడీపీ క్రిస్టియన్ సెల్ ని బలోపేతం చేస్తున్నాం. టీడీపీ హయాంలో ఏ మతం పైనా దాడులు జరగలేదు.

గుడిపై దాడి జరిగినప్పుడు చంద్రబాబు గారు వెళితే కొంత మంది విమర్శించారు. ఏ మతం మీద దాడి జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే క్రిస్మస్ కానుక ఇచ్చాం. హైదరాబాద్ లో మత ఘర్షణలు జరిగినప్పుడు వాటిని కంట్రోల్ చేసింది చంద్రబాబే. టీడీపీ అధికారంలోకి వచ్చాక క్రైస్తవ సోదరుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం"

పత్తి చేలో దిగి రైతు కష్టాలు తెలుసుకున్న లోకేశ్

ఆత్మకూరు నియోజకవర్గం గుడిగుంట క్రాస్ వద్ద పత్తిచేలో దిగిన లోకేశ్, రైతు కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్తి రైతు కరణం రవి తమ ఇబ్బందులను తెలియజేశారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ ... వ్యవసాయ మంత్రి మీ జిల్లా వాడే, ఆయన కోర్టులో పత్రాల చోరీ కేసులో సీబీఐ చుట్టూ తిరుగుతున్నాడని విమర్శించారు. 

"మిమ్మల్ని పట్టించుకునే తీరిక ఆయనకు ఎక్కడుంది? గతంలో 90 శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించడమేగాక ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. రైతులు ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు అంగీకరించొద్దు. అవి మీ మెడకు ఉరితాడుగా మారతాయి. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రిప్ ఇరిగేషన్ తో పాటు గతంలో రైతులకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. 

*యువగళం వివరాలు:*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1623.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 12.9 కి.మీ.*

*128వ రోజు పాదయాత్ర వివరాలు (16-6-2023):*

*ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి నెల్లూరు జిల్లా):*

సాయంత్రం

4.00 – అనంతసాగరం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – అనంతసాగరంలో స్థానికులతో మాటామంతీ.

5.00 – అనంతసాగరం జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.45 – మంచాలపల్లిలో బుడగజంగాలతో సమావేశం.

7.30 – ఉప్పరపాడులో స్థానికులతో మాటామంతీ.

8.00 – వెంకటగిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.

8.15 – కుల్లూరు శివారు విడిది కేంద్రంలో బస.

******



More Telugu News