ఒలింపిక్స్ లో జూదం పెడితే.. ఏపీదే అగ్రస్థానం: ప్రత్తిపాటి పుల్లారావు సెటైర్లు

  • రాష్ట్రంలో జూదం లేదని అసెంబ్లీలో జగన్ ప్రగల్భాలు పలికారన్న ప్రత్తిపాటి
  • సీనియర్‌ సిటిజన్స్‌ క్లబ్బులను మూసేసి పేకాట క్లబ్‌లు తెరిచారని విమర్శ
  • చిలకలూరిపేటలో జరిగేది సీఎంకు కనిపించట్లేదా అని ప్రశ్న
ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సీనియర్‌ సిటిజన్స్‌ క్లబ్బులను మూసేసి పేకాట క్లబ్‌లు తెరిచారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో జూదం అనేది లేదని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుస్తున్నాయని ఆరోపించారు. సగటున రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారని చెప్పారు.

‘‘చిలకలూరిపేటలోని అపార్టుమెంట్లలో, బజార్లలో పేకాట నడుస్తోంది. మంత్రి విడదల రజని సహకారంతోనే యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నారు. పేకాట క్లబ్‌ల ద్వారా రజిని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. పేకాట క్లబ్‌లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

కనుచూపు మేరలో ఉన్న చిలకలూరిపేటలో జరిగేది సీఎంకు కనిపించట్లేదా అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్, మంత్రి విడదల రజని పుణ్యాన జనం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.


More Telugu News