కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం.. వైర్లను పట్టుకుని దిగిన విద్యార్థులు.. వీడియోలు వైరల్
- ఢిల్లీలోని ముుఖర్జీ నగర్ ప్రాంతంలో చెలరేగిన మంటలు
- భయంతో బయటికి పరుగులు తీసిన విద్యార్థులు
- వైర్లు, తాళ్లను పట్టుకుని కిందకు దిగిన మరికొందరు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు కిటికీల నుంచి వైర్లు, తాళ్లను పట్టుకుని కిందకు దిగారు. ముుఖర్జీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అపార్ట్ మెంట్ లోని నాలుగో ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.
అపార్ట్ మెంట్ లో కిటికీల నుంచి పొగలు వస్తుండటం.. పదుల సంఖ్యలో విద్యార్థులు వైర్లు, తాళ్లు పట్టుకుని కిందికి దిగడం వీడియోల్లో కనిపించింది. తాళ్లను పట్టుకోలేక కొందరు జారిపోగా.. మరికొందరు పట్టుతప్పి కిందికి పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడగా.. మిగిలిన వారు సురక్షితంగా కిందకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు.