అంతరిక్ష కేంద్రం నుంచి ‘బిపర్ జోయ్’ తుపాను ఫొటోలు పోస్ట్ చేసిన వ్యోమగామి!

  • ఇవాళ గుజ‌రాత్ తీరం దాట‌నున్న బిప‌ర్‌జోయ్ తుపాను
  • ఇప్పటికే తీర ప్రాంతాల్లో వర్షాలు.. సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది తరలింపు
  • స్పేస్ స్టేష‌న్ నుంచి తుపాను ఫోటోలు, వీడియోలు తీసిన యూఏఈ వ్యోమగామి
బిప‌ర్‌జోయ్ తుపాను ఇవాళ గుజ‌రాత్ తీరం దాట‌నుంది. ఇప్పటికే అతి తీవ్రంగా మారి గుజరాత్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్ప‌టికే 74 వేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఫొటోలను అంత‌రిక్ష కేంద్రం నుంచి ఓ ఆస్ట్రోనాట్‌ ఫోటోలు తీశారు.

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన వ్యోమ‌గామి సుల్తాన్ అల్ నెయది.. ఎంబీఆర్ స్పేస్ స్టేష‌న్ నుంచి ఫోటోల‌ను, వీడియోలను తీశారు. వాటిని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. అంతరిక్షం నుంచి చూస్తే ఆ ఫొటోలు ఎంతో అందంగా కనిపిస్తాయి. నిజానికి ఆ తుపాను ఎంత ప్రమాదకరమనేది.. గుజరాత్ లో.. అదీ తీర ప్రాంతాల్లో ఉన్న వారికే తెలుస్తుంది. అందుకే నెటిజన్లు ‘అందమైన ప్రమాదం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గుజరాత్ ప్రజలు ఈ తుపాను బారి నుంచి బయట పడాలని ప్రార్థిస్తున్నారు.

బిప‌ర్‌జోయ్ ప్రభావంతో గుజ‌రాత్ తీర ప్రాంతాల్లో ఇప్ప‌టికే భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. జామ్‌న‌గ‌ర్‌లో వానలకు తోడు బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. జ‌కావు పోర్టుకు సుమారు 180 కిలోమీట‌ర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంద‌ని, ఇవాళ సాయంత్రం అది తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది.


More Telugu News