సీజేఐకి ‘కోడి కత్తి’ కేసు నిందితుడు శ్రీనివాస్ లేఖ!

  • 1,610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉన్నానన్న శ్రీను
  • తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి
  • కోర్టు నుంచి స్పందన లేకపోవడంతో సీజేఐకి లేఖ రాస్తున్నట్లు వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘కోడి కత్తి కేసు’ విచారణ ఈ రోజు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జరిగింది. విచారణకు ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తోపాటు ఇరు పక్షాల న్యాయవాదులు హాజరయ్యారు. అయితే విచారణ కొనసాగుతుండగానే ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిందితుడు శ్రీనివాస్ లేఖ రాసిన విషయం బయటపడింది.

‘‘1,610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉన్నా. ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదు. నాకు విముక్తి కలిగించండి. నాపై నమోదైన కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలి. న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు విన్నవించా. అయినా స్పందన లేకపోవడంతో మీకు (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి) లేఖ రాస్తున్నా’’ అని తన లేఖలో శ్రీను పేర్కొన్నాడు.

ఈ లేఖ విషయమై శ్రీను తరఫు న్యాయవాది అబ్దుస్ సలీం మాట్లాడుతూ.. తెలుగులో రాసిన లేఖను ఇంగ్లీషులోకి అనువాదం చేసి పంపిస్తున్నామని చెప్పారు. అతని తల్లి సావిత్రి.. గతంలో సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణకు ఇదే విషయంపై లేఖ రాశారని చెప్పారు.

‘‘ఈ కోర్టుకు పది కిలో మీటర్ల దూరంలోనే సీఎం జగన్ నివాసం ఉంటున్నారు. పదిహేను నిమిషాలు కేటాయిస్తే సాక్ష్యం చెప్పి వెళ్లవచ్చు. ఉద్దేశపూర్వకంగా ఆయన తన న్యాయవాదులతో పిటిషన్లు వేయించారు. ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. అయినా కొత్తగా పిటిషన్ వేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి’’ అని ఆరోపించారు. విచారణను వేగవంతం చేసి.. కేసును ముగించాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.


More Telugu News