ఈ సంకేతాలు ఉంటే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే
- ఉదయం నిద్ర లేవగానే ఉల్లాసంగా అనిపించాలి
- భారంగా, బద్ధకంగా, అలసటగా ఉండకూడదు
- కురులు, కంటి సమస్యలు కనిపించకూడదు
- నెలవారీ రుతుక్రమం సరైన సమయానికి రావాలి
నిజంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? ఎవరికి వారే దీన్ని తెలుసుకోవచ్చు. మనం ఎంత ఆరోగ్యవంతులమో మన శరీరమే చెబుతుంటుంది. ఆ సంకేతాలను పట్టుకుంటే చాలు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ సంకేతాల ఆధారంగా అవసరమైతే జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు.
- చక్కని ఆరోగ్యానికి మంచి నిద్ర ఎంతో అవసరం. మంచి నిద్ర అంటే.. ఉదయం లేచిన తర్వాత నీరసంగా, అలసటగా, బద్ధకంగా, అశక్తంగా అనిపించకూడదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఉల్లాసంగా, ఎంతో హాయిగా ఉండాలి. అలా అనిపిస్తే నిద్ర సైకిల్ మెరుగ్గా ఉన్నట్టు అర్థం. తగినంత సమయం నిద్ర పోతున్నారని అర్థం. ఉదయం లేచిన తర్వాత ఉల్లాసంగా లేకపోతే, తగినంత సమయం నిద్ర పోతున్నదీ, లేనిదీ గమనించుకోవాలి. తగినంత సమయం నిద్రించినా కానీ, అసలటగా, మగతగా అనిపిస్తుంటే శారీరక శ్రమ, పోషకాహారం లోపించినట్టు అర్థం చేసుకోవచ్చు.
- శిరోజాల సమస్యలు నేటి తరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి జన్యు సంబంధితం అని అనుకుంటుంటారు. కాలుష్యం అని భావిస్తుంటారు. పోషకాహారం లోపించినా, ఒత్తిడి ఎక్కువైనా శిరోజాలు రాలిపోతాయని గుర్తు పెట్టుకోవాలి. మీ శిరోజాలు ఆరోగ్యంగా ఉండి, జుట్టు రాలే సమస్య లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టే.
- శరీరం నుంచి వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. మూత్రం రంగు స్పష్టంగా ఉంటే శరీరంలో నీటి పరిమాణం తగినంత ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. డీటాక్సిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందని అర్థం. మూత్రం లేత పసుపు లేదా పారదర్శక రంగు కాకుండా మరీ ముదురు పసుపు, ఇతర రంగుల్లో వస్తుంటే అనారోగ్య సమస్యలకు సూచికగా భావించొచ్చు.
- రోజువారీ మల విసర్జన సాఫీగా సాగిపోవాలి. ఈ కార్యక్రమం కోసం కష్టపడకూడదు. దానంతట అదే సంకేతం వచ్చి, విసర్జనకు వెళ్లేట్టు ఉండాలి. ఏరోజుకారోజు పెద్ద పేగు నుంచి మలం మలాశయంలోకి వచ్చి విసర్జితం అవుతుంటే.. జీర్ణ వ్యవస్థ క్రియలు సాఫీగా సాగిపోతాయి. లేదంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ తదితర సమస్యలు వేధిస్తాయి.
- రోజువారీ కార్యకలాపాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ.. వ్యాయామం కూడా చేసుకుంటూ ఉంటే, ఆ సమయంలో నొప్పులు, ఇతర ఇబ్బందులు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టు భావించొచ్చు.
- నోటి ఆరోగ్యం కూడా మొత్తం ఆరోగ్యంలో భాగం. నోటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండకూడదు. రోజులో రెండు సార్లు బ్రష్ చేసి, గార్గిలింగ్ చేసే వారికి ఈ సమస్యలు రావు.
- మహిళల్లో రుతుసరి (రుతు చక్రం) నెలవారీ క్రమం తప్పకుండా ఒకే సమయానికి వస్తుంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్టుగానే భావించొచ్చు.
- రోజువారీ ప్రాణాయామం లేదా యోగా లేదా వాకింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేసే క్రమం తప్పని అలవాటు ఉన్నవారు కూడా ఆరోగ్యంవంతులుగానే భావించొచ్చు.
- కళ్లు పొడిబారిపోవడం, కళ్లు ఎర్రబడడం, లేదా కంటి దురదలు వంటి సమస్యలు లేకపోతే కంటి ఆరోగ్యం సరిగ్గానే ఉన్నట్టు భావించాలి.
- ఒక వయసు అంటే 40 ఏళ్లు దాటిన వారిలో మోకాలు, ఇతర కీళ్ల సమస్యలు కనిపించొచ్చు. కానీ, సమతులాహారం తీసుకుంటే, శారీరక, కండరాలు బలోపేతం అయ్యే వ్యాయామాలు చేస్తే ఇవి ఉండవు.