రోహిత్ కాదంటే.. కెప్టెన్ చాన్స్ ఎవరికి?

  • అజింక్య రహానే మెరుగైన ఆప్షన్ అనే అభిప్రాయం
  • గతంలో ఆరు టెస్టులకు సారథ్యం వహించిన అనుభవం
  • అందులో నాలుగింటిలో భారత్ కు విజయం
  • రిషత్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లకూ అవకాశాలు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మ మూడు రకాల ఫార్మాట్ల భారాన్ని మోయలేకపోతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 36 ఏళ్ల వయసుకు చేరుకున్నందున అతడు టెస్ట్ కెప్టెన్సీని వదులుకుని వైట్ బాల్ క్రికెట్ కు పరిమితం అయితే మంచిదనే విశ్లేషణ వినిపిస్తోంది. వెస్టిండీస్ తో జులైలో జరిగే రెండు టెస్ట్ ల తర్వాత ఫలితాల ఆధారంగా టెస్ట్ కెప్టెన్సీపై సెలక్టర్లు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి టెస్ట్ కెప్టెన్సీగా రోహిత్ శర్మకు విముక్తి కల్పిస్తే.. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఉన్నవారిలో అజింక్య రహానే ఒక ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. అతడు గతంలో ఆరు టెస్టులకు కెప్టెన్ గా సేవలు అందించగా, నాలుగింటిలో విజయాలు అందించాడు. టెస్ట్ కెప్టెన్ గా ఓటమి చవి చూడలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సీజన్ లో కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో అతడు సారథిగా సాధించిన ఫలితాలను ఎవరూ మర్చిపోరు. కనుక రహానేకి తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించి, దీర్ఘకాలం కోసం ఓ యువ కెప్టెన్ ను తయారు చేసుకోవాలనే సూచన విశ్లేషకుల నుంచి వస్తోంది. 

జస్ప్రీత్ బుమ్రా ఒక ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. కానీ, గతంలో అవకాశం ఇచ్చినప్పుడు నిరూపించుకోలేకపోయాడు. రిషబ్ పంత్ ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అవుతాడనే అభిప్రాయం ఉన్నప్పటికీ, అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపించిన శ్రేయాస్ అయ్యర్ కూడా మరొక ఆప్షన్. అతడు కూడా గాయం కారణంగా ఇటీవలి ఐపీఎల్ కు అందుబాటులో లేడు.


More Telugu News