ఇప్పుడు నా మీద పడతారు చూడండి.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్

  • వచ్చే వారం ప్రతిపక్షాల సమావేశం
  • అంతకంటే ముందే తనపై సీబీఐ, ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేస్తాయన్న తేజస్వీ యాదవ్
  • ఆ రెండు సంస్థలను తన ఇంటి వద్దే కార్యాలయాలు తెరుచుకోవాలని కోరిన నేత
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే వారం ప్రతిపక్షాల సమావేశం జరగనున్న నేపథ్యంలో అంతకంటే ముందే తనపై నమోదు చేసిన కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు చార్జ్‌షీట్ దాఖలు చేస్తాయని అన్నారు. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంపై జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయనిలా బదులిచ్చారు. ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో మనపైన కూడా వరుస దాడులు, అరెస్టులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో మనం బలంగా మారడం వల్ల వీటిని ఎదుర్కోక తప్పదని అన్నారు.

 ‘‘ఇప్పటి వరకు నాపై చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. దర్యాప్తు సంస్థలు త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’’ అని తేజస్వీయాదవ్ చెప్పుకొచ్చారు. లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్టుగా చెబుతున్న ‘ల్యాండ్ ఫర్ హోటల్స్’, ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణంలో 34 ఏళ్ల తేజస్వీ యాదవ్ పేరు కూడా ఉంది. తనపైనా తన సన్నిహితులపైనా దర్యాప్తు సంస్థలు ఎన్నిసార్లు దాడులు చేశాయో లెక్కేలేదని మంత్రి అన్నారు. ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న తేజస్వీ.. ఈ రెండు సంస్థలు తమ కార్యాలయాలను తన ఇంటి దగ్గరే తెరవాలని వ్యంగ్యంగా  అన్నారు.


More Telugu News