రావణకాష్ఠంలా మణిపూర్.. మహిళా మంత్రి ఇంటికి నిప్పు

  • జాతుల మధ్య ఘర్షణలతో రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం
  • గత 24 గంటల్లో 9 మంది మృత్యువాత
  • ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో మంత్రి ఇంట్లో లేరన్న అధికారులు
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా మంత్రి ఇంటికి తాజాగా దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లా లాంఫెల్ ప్రాంతంలో పరిశ్రమల మంత్రి నెమ్చా కిప్గెన్ బంగళాను లక్ష్యంగా చేసుకున్న దుండగులు నిన్న సాయంత్రం నిప్పు పెట్టారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. 

సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ అధికారుల నేతృత్వంలోని భద్రతా బలగాలు మంత్రి ఇంటికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వంలోని 12 మంది మంత్రుల్లో కిప్గెన్ ఏకైక మహిళా మంత్రి. ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 10 మంది కుకీ ఎమ్మెల్యేలలో కిప్గెన్ ఒకరు. కాగా, గత 24 గంటల్లో కాల్పుల ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు ఆర్మీ తెలిపింది.



More Telugu News