ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చాలా ప్రమాదం: నారా లోకేశ్

  • ఉమ్మడి నెల్లూరులో జిల్లాలో నారా లోకేశ్ యువగళం
  • ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర
  • నాయుడుపల్లిలో రైతులతో ముఖాముఖి
  • రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ
రాష్ట్రంలో రైతు రాజ్యం తెస్తానన్న జగన్ రైతులేని రాజ్యంగా మారుస్తున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా, నాయుడుపల్లిలో రైతులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... జగన్ అసమర్థ పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే నంబర్ 3గా ఉందని వెల్లడించారు. జగన్ రైతుపై ఉన్న తలసరి అప్పులో ఏపీని నెంబర్ 1 చేశాడని విమర్శించారు. 

"గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేస్తేనే రాష్ట్రంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో రాష్ట్రంలోని ప్రాజెక్టులు చూస్తే అర్దం అవుతుంది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది" అని వివరించారు.

"టీడీపీ హయాంలో ఒక్కో రైతుపై రూ.75 వేలు అప్పు ఉంటే ఇప్పుడు జగన్ పాలనలో ఒక్కో రైతుపై రూ.2.50 లక్షలకు చేరింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకోవడానికి అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. టీడీపీ హయాంలో ఒకే సంతకంతో రూ.50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేశాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్ని సబ్సిడీలో అందించాం. 

ఉపాధి హామీ పథకాన్ని లింక్ చేసి పంట కుంటలు తవ్వాం. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. రైతు రథాలు, ఎన్టీఆర్ జలసిరి కింద బోర్ వేసి సోలార్ పంపు సెట్లు, సూక్ష్మ పోషకాలు ఇచ్చాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం" అని వివరించారు. 

నెల్లూరు జిల్లాకు అనిల్ అన్యాయం చేశారు: లోకేశ్ 

వైసీపీ పాలనలో మొదటి రెండేళ్లు నెల్లూరు జిల్లాకి చెందిన అనిల్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కాకాణి కోర్టు దొంగ, ఆయన సీబీఐ కేసులో బిజీగా ఉన్నాడు. సొంత జిల్లాలో అకాల వర్షాలతో రైతులు నష్టపోతే వారిని ఆదుకోవాలనే ఆలోచన కూడా కోర్టు దొంగకి రాలేదు. జగన్ పాలనలో భూసార పరీక్షా కేంద్రాలకు కరెంట్ బిల్లులు చెల్లించక మూతబడ్డాయి.

ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 500 బోర్లు వేస్తానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చి, మాటతప్పాడు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకొలేదు. వైసీపీ పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం ఎంత ధాన్యం కొంటారో చెప్పలేని దుస్థితి. 

నెల్లూరు జిల్లాలో ధాన్యం కుంభకోణం రాష్ట్రం మొత్తం చూసింది. వరి రైతులని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకుంటాం. సకాలంలో డబ్బులు వేస్తాం.

సోమశిల నిర్వాసితులకు పరిహారం ఇస్తాం

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల ప్రాజెక్టు పూర్తి చేసి ముంపు బాధితులకు పరిహారం అందిస్తాం. పిల్ల కాలువలు కూడా పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తాం. హార్టి కల్చర్ ని టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కనీస సహకారం ఇవ్వడం లేదు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హార్టికల్చర్ పంటల వారీగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఎక్కువ రకాలు సాగు చేసేలా రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తాం. తక్కువ ధరకే మొక్కలు అందిస్తాం. మామిడి, అరటి, దానిమ్మ, కర్జూరం, బొప్పాయి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేలా కంపెనీలతో ఒప్పందం చేసుకొని రైతులను ఆదుకుంటాం. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తనం దగ్గర నుండి గిట్టుబాటు ధర ఇచ్చే వరకూ బాధ్యత తీసుకుంటాం. పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. రైతులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ పాలనలో రద్దు చేసి రూ.7,500 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1611 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14 కి.మీ.*

*127వ రోజు పాదయాత్ర వివరాలు (15-6-2023):*

*ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి నెల్లూరు జిల్లా):*

మధ్యాహ్నం

2.00 – బొమ్మవరం శివారు క్యాంప్ సైట్ లో యువతతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – బొమ్మవరం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – గుడిగుంట క్రాస్ వద్ద పత్తి పొలాల సందర్శన, రైతులతో భేటీ.

4.30 – గుడిగుంట క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

4.40 – చిలకలమర్రిలో స్థానికులతో సమావేశం.

5.10 – మంగుపల్లిలో స్థానికులతో సమావేశం.

5.20 – కామిరెడ్డిపాడులో స్థానికులతో సమావేశం.

7.40 – గౌరవరంలో స్థానికులతో సమావేశం.

7.50 – గౌరవరం కాలనీవాసులతో సమావేశం.

8.10 – అనంతసాగరం పంచాయితీ సంజీవనగర్ లో ముస్లింలతో భేటీ.

8.20 – అనంతసాగరం శివారు విడిది కేంద్రంలో బస.

******


More Telugu News