బిపర్‌జోయ్ తుపాను: 16 వరకు భుజ్ విమానాశ్రయం క్లోజ్, రంగంలోకి 18 ఎన్డీఆర్ఎఫ్ టీంలు

  • కచ్ సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ 
  • స్వామినారాయణ టెంపుల్ లో దాదాపు 5000 ఫుడ్ ప్యాకెట్స్ సిద్ధం
  • కచ్ తీర ప్రాంతంలో నిలిచిపోయిన చేపల పడవలు
  • కచ్ లో ఆసుపత్రులను తనిఖీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ తీరం దిశగా దూసుకొస్తోంది. గురువారం సాయంత్రం తుపాన్ గుజరాత్ లోని జఖౌ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో ఈ తుపాన్ కలిగించే నష్టాన్ని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కచ్ సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భుజ్ విమానాశ్రయాన్ని జులై 16 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. మాండ్విలోని స్వామినారాయణ టెంపుల్ లో దాదాపు 5000 ఫుడ్ ప్యాకెట్స్ ను అవసరమైన సమయంలో ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బిపర్ జోయ్ తుపాన్ నేపథ్యంలో చేపలు పట్టేందుకు ఎవరూ సముద్రంలోకి వెళ్లడం లేదు. దీంతో కచ్ తీరంలో పెద్ద ఎత్తున పడవలు నిలిచిపోయాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ కచ్ లోని ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఆక్సిజన్, వెంటిలెటర్, క్రిటికల్ కేర్ బెడ్స్ తదితర వివరాలపై ఆసుపత్రి వర్గాల నుండి ఆరా తీశారు. తుపాన్ అనంతరం సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉండాలని ఆదేశించారు.

బిపర్ జోయ్ తుపాన్ నేపథ్యంలో గుజరాత్ తీర ప్రాంతాల్లో 4,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. వీరికి ద్వారకలో షెల్టర్ హోమ్స్ సిద్ధం చేశారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ఏడు జిల్లాల నుండి మొత్తం 47,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 18 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధం చేశారు. తుపాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 69 రైళ్లను రద్దు చేశారు.


More Telugu News