బిపర్‌జోయ్ తుపాను ఎఫెక్ట్.. భారీ వర్షాలు, గాలులతో ఊగిపోతున్న గుజరాత్

  • రేపు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాను
  • అల్లకల్లోలంగా మారిన సముద్రం
  • ఓడరేవుల మూత.. నౌకలకు లంగర్లు
  • కూలుతున్న భారీ వృక్షాలు.. లేచిపోతున్న ఇళ్ల పైకప్పులు
బిపర్‌జోయ్ తుపాను రేపు గుజరాత్ తీరం దాటనున్న వేళ నేటి నుంచి అక్కడ బీభత్సం మొదలైంది. పోర్‌బందర్‌లో భారీ ఈదురు గాలులతో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల వృక్షాలు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు గాల్లో తేలివెళ్లాయి. రోడ్లపై చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుజరాత్‌లో ఎల్లుండి వరకు చేపల వేటను రద్దు చేశారు.

తుపాను తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలంటూ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఓడరేవులు మూసివేశారు. నౌకలను లంగరు వేసి నిలిపేశారు. అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలులతో వాతావరణం ప్రతికూలంగా మారింది.

కచ్, దేవ్‌భూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాగఢ్, మోర్బీ జిల్లాల్లో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ద్వారకలో 400 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు. జఫ్రాబాద్‌లోని షియాల్‌బెట్ గ్రామస్థులకు పోలీసులు పాలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మరోవైపు, ముంబై తీరంలోనూ సముద్రం అల్లకల్లోలంగా మారింది.


More Telugu News