రోహిత్ టెస్ట్ కెప్టెన్సీపై నీలి నీడలు.. వెస్టిండీస్ సిరీస్ తర్వాత నిర్ణయం

  • జులై 12 నుంచి వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ సమరం
  • మొత్తం రెండు టెస్టుల్లో తలపడనున్న జట్లు
  • వీటిల్లో రోహిత్ పనితీరు ఆధారంగా సెలక్టర్ల నిర్ణయం
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చెందడంతో, రోహిత్ శర్మ కెప్టెన్సీపై సందేహాలు నెలకొన్నాయి. ఫైనల్ మ్యాచ్ లో ఓటమికి కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తుండడం రోహిత్ కు ప్రతికూలమనే చెప్పుకోవచ్చు. టాస్ గెలిచినా, బ్యాటింగ్ బదులు బౌలింగ్ తీసుకుని రోహిత్ తప్పు చేశాడని చాలా మంది క్రికెట్ పండితులు ఇప్పటికే చెప్పారు. అలాగే, రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకోకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. 

విదేశీ గడ్డపై టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మొదటిది. రోహిత్ కెప్టెన్సీలో 2022 టీ20 ఫైనల్ లో భారత్ ఓటమి చవిచూడగా, ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ మరోసారి ఓటమి పాలైంది. దీంతో రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ దీనిపై ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023/25 సీజన్ లో భాగంగా వచ్చే నెలలో వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్ట్ మ్యాచులు ఆడనుంది. వీటిల్లో రోహిత్ ఏ మేరకు రాణిస్తాడో చూసిన తర్వాతే సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. 

‘‘కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడం అనేది ఆధార రహితం. వెస్టిండీస్ తో రెండు టెస్ట్ లు, అందులో బ్యాటర్ గా రోహిత్ పనితీరు చూసిన తర్వాత శివ్ సుందర్ దాస్, ఆయన సహచరులు రోహిత్ శర్మపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జులై 12, 20వ తేదీల్లో వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ మ్యాచులు ఆడనుంది. మళ్లీ ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంటుంది. కనుక సెలక్టర్లకు తగినంత సమయం ఉంటుందని తెలుస్తోంది.


More Telugu News