ఆయన ప్రపంచానికే నిధిలాంటి వారు.. అజిత్ ధోవల్ పై అమెరికా రాయబారి ప్రశంసలు

  • భారతీయులు, అమెరికన్ల మధ్య మెండుగా ప్రేమాభిమానాలు
  • డిజిటల్ పేమెంట్స్ లో ఇండియా దూసుకెళుతుందన్న ఎరిక్ గార్సెట్టి
  • ఢిల్లీలో ఇరు దేశాల భద్రతా సలహాదారుల భేటీ
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ పై అమెరికా రాయబారి ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశానికి ధోవల్ ఓ నిధిలాంటి వారని, ఆయన భారత్ కు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికే నిధి అని పేర్కొన్నారు. ఓ చిన్న మారుమూల ప్రాంతం నుంచి ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మనదేశంలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎరిక్ గార్సెట్టీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో జరిగిన ఇరు దేశాల భద్రతా సలహాదారుల భేటీ కోసం అమెరికా ఎన్ఎస్ఏ జేక్ సల్లీవాన్ భారత్ లో పర్యటిస్తున్నారు. అజిత్ ధోవల్, సల్లీవాన్ భేటీ సందర్భంగా ఎరిక్ గార్సెట్టీ మాట్లాడుతూ.. అమెరికన్లకు భారతీయుల పైన, భారతీయులకు అమెరికన్లపైన ప్రేమ ఉందని చెప్పారు. దీంతో రెండు దేశాల మధ్య బలమైన బాంధవ్యం నెలకొందని పేర్కొన్నారు.

డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఇండియా దూసుకెళుతోందని, మారుమూల ప్రాంతాల్లోని టీ స్టాల్ లో కూడా ఆన్ లైన్ పేమెంట్స్ సదుపాయం ఉంటుందని గార్సెట్టీ వివరించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదును ఆ టీ స్టాల్ నడిపే వ్యక్తి నేరుగా అందుకుంటున్నాడని తెలిపారు. కాగా, ఈ భేటీలో భాగంగా అజిత్ ధోవల్, జేక్ సల్లీవాన్ ల మధ్య పలు అంశాలపై చర్చ జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి.


More Telugu News