లోకే​శ్​ కోసం వచ్చిన జనంతో కంభం అటవీ ప్రాంతంలో 3 కి.మీ.​​ స్తంభించిన ట్రాఫిక్

  • రాయలసీమ నుంచి వీడ్కోలు తీసుకున్న లోకేశ్
  • ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర
  • వందలాది వాహనాలతో వచ్చిన టీడీపీ శ్రేణులు
  • క్రిక్కిరిసిపోయిన కంభం అటవీప్రాంత రహదారి
రాయలసీమలో యువగళం పాదయాత్ర ముగించుకుని ఈ సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అపూర్వ స్వాగతం లభించింది. నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కంభం అటవీ ప్రాంతంలో వందలాది వాహనాల్లో తరలి వచ్చారు. భారీఎత్తున బాణసంచా కాల్చుతూ హోరెత్తించారు. 

నెల్లూరు జిల్లా బోర్డర్ లోకి లోకేశ్ అడుగుపెట్టే సమయంలో కార్యకర్తలు పాదయాత్ర దారిలో 101 కొబ్బరికాయలు కొట్టి యువనేతను ఆహ్వానించారు. యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో కంభం అటవీప్రాంతంలో 3 కి.మీ.లకు పైగా వాహనాలు, కార్యకర్తలతో రహదారి కిక్కిరిసిపోయింది. 

పాదయాత్రకు అనూహ్యరీతిలో తరలివచ్చిన జనసందోహంతో పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. యువగళం పాదయాత్ర కంభం అటవీ ప్రాంతం నుంచి కదిరినాయుడుపల్లె వద్ద ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

మిషన్ రాయలసీమతో రుణం తీర్చుకుంటా!

యువగళం పాదయాత్రలో తనను ఆదరించిన రాయలసీమ ప్రజానీకానికి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నాలుగేళ్ల అరాచక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా నేను చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి మజిలీని మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయగలిగాను అంటూ వినమ్రంగా తెలిపారు. 

"124 రోజుల పాటు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో నాతోపాటు యువగళం బృందాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాయలసీమ ప్రజలు మాపై చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరువలేను. అడుగడుగునా సీమ ప్రజల కష్టాలను నేరుగా చూశాక తీవ్ర మనోవేదనకు గురయ్యాను. రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్య, నిరుద్యోగం, వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాను. 

అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ ద్వారా మీ కన్నీళ్లు తుడిచి రుణం తీర్చుకుంటానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నాను. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలబడే పోరాట స్ఫూర్తిని మీ నుంచి పొందిన నేను లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించబోను" అని లోకేశ్ పేర్కొన్నారు.

*యువగళం వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1597 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 12.9 కి.మీ.*

*126వ రోజు పాదయాత్ర వివరాలు (14-6-2023):*

*ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి నెల్లూరు జిల్లా):*

మధ్యాహ్నం

2.00 – నాయుడుపల్లి క్యాంపు సైట్ లో రైతులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – నాయుడుపల్లి క్యాంపు సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – అనంతసాగరంలో గ్రామస్తులతో సమావేశం.

4.50 – పాత నాయుడుపల్లిలో గ్రామస్తులతో సమావేశం.

5.35 – చుంచులూరులో పాదయాత్ర 1600 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

6.20 – గోగులపల్లిలో స్థానికులతో మాటామంతీ.

7.15 – అగ్రహారంలో రైతులతో సమావేశం.

7.45 – బొమ్మవరంలో గ్రామస్తులతో సమావేశం.

8.15 – బొమ్మవరం శివారు విడిది కేంద్రంలో బస.

******



More Telugu News