ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం: కేటీఆర్

  • దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం
  • మహిళా లోకానికి శుభాకాంక్షలు చెబుతూ కేటీఆర్ ట్వీట్
  • కేసీఆర్ ప్రభుత్వం అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోందన్న మంత్రి
మహిళలు ఆకాశంలో సగం కాదని.. ‘ఆమే’ ఆకాశమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు చెబుతూ మంత్రి ట్వీట్ చేశారు. ఆకాశంలో ఆమె సగం కాదని, ఆమే ఆకాశమని పేర్కొన్నారు. సంక్షేమంలో ఆమెదే అగ్రభాగమని తెలిపారు. మహిళా శిశుసంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. 

పుట్టిన బిడ్డల నుంచి అవ్వల వరకు కేసీఆర్ ప్రభుత్వం అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోందన్నారు. గర్భిణులకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులని, ఆడబిడ్డ పుడితే ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టేనని, కేసీఆర్ కిట్‌తోపాటు అందే రూ. 13 వేలు ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలని అన్నారు. లక్ష్మీకటాక్షంతోపాటు తెలంగాణ బిడ్డలకు సరస్వతీ కటాక్షం కూడా ఉందని, కార్పొరేటుకు దీటైన గురుకులాలతో తల్లిదండ్రుల కలలు సాకారమవుతున్నాయని పేర్కొన్నారు.


More Telugu News