ఒక్క ఎంఆర్ఎఫ్ షేరుకు లక్ష రూపాయలు!

  • నేడు స్టాక్ ఎక్సేంజ్ లలో లక్ష రూపాయలను తాకిన షేరు 
  • షేరు ధర పెరిగినా ముఖ విలువను విభజించని కంపెనీ
  • బోనస్ లు కూడా జారీ చేయకపోవడంతో ఎప్పటికప్పుడు కొత్త ధర
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎంఆర్ఎఫ్ ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. ఎంఆర్ఎఫ్ షేరు ధర లక్ష రూపాయలను ఈ రోజు తాకింది. బీఎస్ఈలో 1,00,300ను తాకిన ఈ షేరు ప్రస్తుతం రూ.99999 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేరు ఏడాది కనిష్ఠ ధర రూ.65,900గా ఉంది. ఒక్క షేరు రూ.లక్షకు చేరిన మరో ఘటన భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో లేదు. నిజానికి ఈ ఏడాది మే నెలలోనే ఎంఆర్ఎఫ్ షేరు ధర రూ.లక్షకు సమీపానికి చేరుకుంది. రూ.లక్షను నమోదు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అక్కడ లాభాల స్వీకరణ ఎదురు కావడంతో అమ్మకాల ఒత్తిడికి షేరు ధర పడిపోయింది. 

ఎంఆర్ఎఫ్ తర్వాత మన దేశంలో అధిక ధర వద్ద ట్రేడయ్యే మరో షేరు హనీవెల్ ఆటోమేషన్. ఇది ప్రస్తుతం రూ.41,152 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, పేజ్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్, 3ఎం ఇండియా, అబాట్ ఇండియా, నెస్లే, బాష్ షేర్ల ధరలు కూడా అధిక స్థాయిలోనే ఉన్నాయి. మరి ఎంఆర్ఎఫ్ షేరు ఎందుకు అంత అధికంగా ఉంది? అన్న సందేహం రావచ్చు. ఎంఆర్ఎఫ్ జారీ మూలధనం (ఈక్విటీ) చాలా చిన్నది. మొత్తం ప్రమోటర్లు, ప్రజల వద్దనున్న షేర్లు   42,41,143. ఎంఆర్ఎఫ్ టైర్ల పరిశ్రమలో దిగ్గజ కంపెనీ కావడం, భారీ అమ్మకాలు, లాభాలతో షేరు వారీ ఆర్జన అధికంగా ఉంది. అందుకే షేరు ధర రూ.లక్షకు చేరుకుంది. 

సాధారణంగా షేరు ధర తక్కువలో ఉంటే చిన్న ఇన్వెస్టర్లు కూడా కొనుగోలుకు ముందుకు వస్తారు. దాంతో ట్రేడింగ్ పరిమాణం పెరుగుతుంది. ఫ్లోటింగ్ లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు షేరు ధర పెరిగే క్రమంలో ముఖ విలువను విభజిస్తుంటాయి. బోనస్ ప్రకటిస్తుంటాయి. దాంతో షేరు ధర తగ్గుతుంటుంది. కానీ, ఎంఆర్ఎఫ్ అలాంటివి ఎప్పుడూ చేయలేదు. అందుకే షేరు ధర కొండెక్కిందని చెప్పుకోవాలి. అంత ధర ఉన్నా ఒక్కో షేరు పీఈ 55గానే ఉండడం గమనించొచ్చు.


More Telugu News