బెంగళూరులో విదేశీ యూట్యూబర్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్.. వీడియో ఇదిగో!

  • బెంగళూరులో పర్యటించిన నెదర్లాండ్స్ యూట్యూబర్
  • ఇండియాలో తాను దాడికి గురయ్యానంటూ వీడియో పోస్ట్
  • స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఆ కాసేపటికే ‘దట్స్ ఇండియా బ్రో’ అంటూ మరో వీడియో షేర్ చేసిన పెడ్రో మోటా  
ఇండియాలో పర్యటిస్తున్న డచ్ యూట్యూబర్ పెడ్రో మోటాపై బెంగళూరు చిక్‌పేటలోని చోర్‌బజార్‌లో దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన చానల్‌లో పంచుకోవడంతో స్పందించిన పోలీసులు దాడిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మోటా షేర్ చేసిన వీడియో ప్రకారం.. మార్కెట్లో తిరుగుతున్న మోటా వద్దకు ఓ వ్యాపారి వచ్చాడు. 

మోటా ఆయనకు ‘నమస్తే’ అని విష్ చేశాడు. దీంతో ఆ వ్యాపారి కోపంగా ‘నమస్తే ఏంటి నమస్తే.. ఏంటిది.. ఏం చేస్తున్నావ్?’ అని ప్రశ్నిస్తూ చెయ్యి పట్టుకుని మెలితిప్పాడు. తనను వెళ్లనీయాలని కోరినా అతడు ఆ చేయిని వదల్లేదు. అది చూసి మరికొందరు వ్యాపారులు అక్కడ గుమికూడారు. వారి నుంచి తప్పించుకున్న ఆయన ముందుకు నడిచాడు. 

ఈ వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేసిన మోటా.. భారత్‌లో దాడికి గురయ్యానని రాసుకొచ్చాడు. ఇది చూసిన పోలీసులు నిందితుడు నవాబ్ హయత్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. విదేశీ పర్యాటకులను భయపెట్టడం, దాడులు చేయడం వంటివి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

దట్స్ ఇండియా బ్రో
ఆ తర్వాత మరో వీడియోను పోస్టు చేసిన మోటా.. ‘దటీజ్ ఇండియా’ అంటూ ప్రశంసలు కురిపించాడు. అందులో కొందరు వ్యక్తులు ఆయనకు గైడ్ చేస్తూ కనిపించారు. ‘జై శ్రీరామ్’, ‘నమస్తే’ అంటూ పలకరించుకోవడం కనిపించింది. మంచి టీ షర్టులు ఎక్కడ లభిస్తాయని మోటా వారిని అడగ్గా.. వారు ఆయనకు చిరునవ్వుతో వివరాలు చెప్పారు. ‘‘నన్ను నమ్మండి. ఈ రోజు నేను చిరునవ్వుతో కూడిన ముఖాలను చూసి చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు మంచి రోజు’’ అంటూ వారి నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ‘‘దట్స్ ఇండియా బ్రో! ఆబ్సల్యూట్లీ’’  అని చెప్పుకొచ్చాడు.


More Telugu News