గోధుమల స్టాక్ పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం

  • గోధుమల ధరలు 8 శాతం పెరగడంతో స్టాక్ పరిమితి విధింపు
  • 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలు బహిరంగ మార్కెట్ లోకి
  • గోధుమల దిగుమతి విధానం మార్చే ఆలోచన లేదన్న ఆహారశాఖ కార్యదర్శి
గత నెలలో గోధుమల ధరలు 8 శాతం పెరగడంతో కేంద్రం సోమవారం వాటిపై స్టాక్ పరిమితిని విధించింది. కేంద్రం స్టాక్ పరిమితి విధింపు కారణంగా దాదాపు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేయడానికి దోహదపడి, ధరలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దేశంలో పుష్కలంగా స్టాక్ అందుబాటులో ఉన్నందున గోధుమల దిగుమతి విధానాన్ని మార్చే ఆలోచన లేదని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. అదే సమయంలో గోధుమ ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందన్నారు. 

తాజా స్టాక్ పరిమితి నోటిఫికేషన్ ప్రకారం, టోకు వ్యాపారులు, వ్యాపారులు 3,000 మెట్రిక్ టన్నుల గోధుమలను నిల్వ చేసుకోవచ్చు. రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులను ఉంచుకోవచ్చు. పెద్ద రిటైల్ చైన్‌ల విషయానికి వస్తే స్టాక్ పరిమితి ప్రతి అవుట్‌లెట్‌కు 10 మెట్రిక్ టన్నులు, ఈ రిటైల్ చైన్ లోని అన్ని ఔట్ లెట్ లలో కలిపి 3,000 మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకోవచ్చు. ఈ స్టాక్ పరిమితి మార్చి 2024 వరకు అమల్లో ఉంటుంది.

చివరిసారిగా 2008లో గోధుమలపై స్టాక్ పరిమితిని అమలు చేశారు. ఈ ఏడాది జూన్ 2న కంది తదితర ఉత్పత్తుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇదే విధానాన్ని ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలో అంచనా తగ్గుదల కారణంగా ఈ ఉత్పత్తుల రిటైల్ ధరలు పెరిగాయి.


More Telugu News