టీమిండియా ఓటమిపై గవాస్కర్, రవిశాస్త్రి ఏమన్నారంటే...!

  • డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఘోర పరాజయం
  • 209 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి
  • టీమిండియా బ్యాటింగ్ అస్తవ్యస్తంగా ఉందన్న గవాస్కర్
  • రోహిత్ శర్మ, పుజారా చెత్త షాట్లతో అవుటయ్యారన్న రవిశాస్త్రి
వరుసగా రెండో సీజన్ లోనూ డబ్ల్యూటీసీ ఫైనల్ మెట్టుపై చతికిలపడిన టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అది కూడా ఎంతో కీలకమైన టాస్ గెలిచి, మ్యాచ్ ను చేజార్చుకోవడాన్ని సగటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

భారత జట్టు ఘోర పరాజయంపై మాజీలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి స్పందించారు. ఆఖరి రోజున టీమిండియా బ్యాటింగ్ అస్తవ్యస్తంగా ఉందని, హాస్యాస్పదమైన బ్యాటింగ్ ను చూశామని గవాస్కర్ విమర్శించారు. ఇలాంటి బ్యాటింగ్ లైనప్ తో కనీసం ఒక సెషన్ పాటు బ్యాటింగ్ చేయగలరా? అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ అవుటైన తీరును కూడా గవాస్కర్ విమర్శించారు. "ఓ మ్యాచ్ గెలవడం గురించి, సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం గురించి అతడు చాలా మాటలు చెబుతాడు. కానీ ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడే ప్రయత్నం చేస్తే, అతడు చెప్పినట్టు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం అయ్యే పనేనా?" అంటూ వ్యాఖ్యానించారు. 

టీమిండియాకు గతంలో కోచ్ గా వ్యవహరించిన రవిశాస్త్రి స్పందిస్తూ... డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత  టాపార్డర్ బ్యాట్స్ మెన్ షాట్ల ఎంపిక లోపభూయిష్టంగా ఉందని విశ్లేషించారు. పిచ్ ఆ విధంగా స్పందిస్తుండడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తే, ఆ పిచ్ పై రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా చెత్త షాట్లకు ప్రయత్నించడం ఇంకా ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. అలాంటి షాట్లు ఆడినందుకు వారిద్దరు తమను తాము నిందించుకోవాలి అని పేర్కొన్నారు. ఎంతో కళాత్మకంగా బ్యాటింగ్ చేసే వారిద్దరి నుంచి అలాంటి చెత్త షాట్లు ఊహించనివని రవిశాస్త్రి వివరించారు.


More Telugu News