వారాహి యాత్రకు ముందు.. ‘ధర్మ యాగం’ చేపట్టిన పవన్ కల్యాణ్!
- మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ యాగం
- గణపతి పూజతో యాగానికి అంకురార్పణ చేసిన జనసేన అధినేత
- రేపు కూడా కొనసాగనున్న యాగం..
- ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్ర
ఏపీలో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. ఎల్లుండి నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ధర్మయాగం చేపట్టారు. రెండు రోజుల పాటు సాగే యాగాన్ని ఈ రోజు ఉదయం 6.55 గంటలకు ప్రారంభించారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. ‘‘పవన్ పట్టు వస్త్రాలతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. గణపతి పూజతో యాగానికి అంకురార్పణ చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. ఈ యాగం రేపు కూడా కొనసాగనుంది’’ అని అందులో పేర్కొన్నారు. పవన్ యాగానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరోవైపు ఏపీలో జూన్ 14 నుంచి 23 వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని జనసేన ప్రకటించింది. కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ప్రారంభమయ్యే తొలి విడత వారాహి యాత్ర భీమవరం వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో పవన్ చేపట్టిన యాగం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.