‘మా అమ్మ చనిపోయింది’.. అమెజాన్ అడవుల్లో 40 రోజుల తర్వాత లభ్యమైన చిన్నారుల తొలిమాట!

  • మే 1న కొలంబియాలోని అడవుల్లో కూలిన విమానం
  • చిన్నారుల తల్లి, పైలట్ సహా ముగ్గురి మృతి
  • 40 రోజులపాటు అడవిలో గడిపిన చిన్నారులు
  • ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించిన రెస్క్యూ సిబ్బంది
కొలంబియాలోని అమెజాన్ అడవుల్లో విమానం కూలిన ఘటనలో తల్లి సహా ముగ్గురిని కోల్పోయి దట్టమైన అడవిలో 40 రోజులపాటు గడిపి చివరికి సురక్షితంగా బయటపడిన నలుగురు చిన్నారులు తొలిసారి మాట్లాడిన మాటలను రెస్క్యూ సిబ్బంది ఒకరు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు ఆకలిగా ఉంది’, ‘అమ్మ చనిపోయింది’ అని చెబుతూ హృదయాలను కరిగించారు.  

నెల రోజులకు పైగా అడవిలో గడిపిన ఆ చిన్నారుల వయసు 13, 9, 5 ఏళ్లుగా కాగా, మరో చిన్నారి వయసు 11 నెలలు మాత్రమే. వారు తొలిసారి మాట్లాడిన మాటలను వారిని రక్షించిన సిబ్బంది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నారులు ప్రస్తుతం కొలంబియా రాజధాని బొగొటాలోని మిలటరీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. 

చిన్నారిని చేతుల్లో ఎత్తుకున్న అందరికంటే పెద్దదైన అమ్మాయి లెస్లీ.. తనవైపు వస్తూ ఆకలిగా ఉందని చెప్పిందని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న నికోలస్ ఆర్డోనెజ్ గోమెస్ తెలిపారు. నేలపై పడుకున్న ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు మాట్లాడుతూ.. ‘అమ్మ చనిపోయింది’ అని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. వెంటనే తాము వారికి ఊరటనిచ్చే మాటలు మాట్లాడామని, వారి తండ్రి, అంకుల్ పంపిస్తేనే ఇక్కడు వచ్చామని, మనంతా ఒకటేనని చెప్పామని పేర్కొన్నారు.

మే 1న చిన్నారులు ప్రయాణిస్తున్న సెస్నా 206 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్, చిన్నారుల తల్లి, మరో వ్యక్తి మరణించారు. విమానం కూలిన ప్రదేశంలోనే వారి మృతదేహాలను గుర్తించారు.


More Telugu News