ఫ్రెంచ్ ఓపెన్ లో జకో మ్యాజిక్... మట్టికోటలో మరోసారి విజేత

  • పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన నొవాక్ జకోవిచ్
  • ఫైనల్లో 7-6, 6-3, 7-5తో కాస్పర్ రూడ్ పై విజయం
  • ఫ్రెంచ్ ఓపెన్ లో జకోవిచ్ కు ఇది మూడో టైటిల్
  • వరుసగా రెండో ఏడాది కూడా రన్నరప్ తో సరిపెట్టుకున్న కాస్పర్ రూడ్
క్లే కోర్టులపై నిర్వహించే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జకోవిచ్ 7-6, 6-3, 7-5తో నార్వే క్రీడాకారుడు కాస్పర్ రూడ్ పై విజయం సాధించాడు. కొన్ని సమయాల్లో కాస్పర్ రూడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ జకో తన అనుభవాన్ని ప్రదర్శించి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు. 

అనవసర తప్పిదాలతో కాస్పర్ రూడ్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. పలుమార్లు జకోవిచ్ సర్వీసును బ్రేక్ చేసిన ఈ నార్వే ఆటగాడు... ఒత్తిడిని అధిగమించలేక కీలక సమాయాల్లో పాయింట్లు చేజార్చుకున్నాడు. 

దురదృష్టం ఏమిటంటే... ఫ్రెంచ్ ఓపెన్ లో గతేడాది కూడా కాస్పర్ రూడ్ రన్నరప్ గా సరిపెట్టుకున్నాడు. 2022లో ఫైనల్ వరకు వచ్చినా, రఫెల్ నడాల్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ఏడాది జకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. 

జకోవిచ్ కు ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. 2016, 2021 సీజన్లలోనూ జకో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 

ఓవరాల్ గా పురుషుల సింగిల్స్ విభాగంలో జకోవిచ్ కు ఇది 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్. తద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్ల వీరుడిగా చరిత్ర సృష్టించాడు. జకోవిచ్ తర్వాత స్థానంలో 22 టైటిళ్లతో రాఫెల్ నాదల్ రెండో స్థానంలో ఉన్నాడు. 

అటు, మహిళల సింగిల్స్ లోనూ సెరెనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించింది. ఇప్పుడు జకోవిచ్ కూడా 23 టైటిళ్లతో సెరెనా సరసన చేరాడు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగం మొత్తమ్మీద చూస్తే మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉంది.


More Telugu News