టీమిండియా ఘోర పరాజయం... ఐసీసీ గద ఆసీస్ సొంతం

  • డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిన భారత్
  • అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆసీస్
  • రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టార్గెట్ 444 రన్స్
  • 234 పరుగులకే కుప్పకూలిన భారత్
  • ఇవాళ 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వైనం
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ విజేతగా అవతరించింది. సగర్వంగా ఐసీసీ గదను సొంతం చేసుకుంది. 

444 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులకే కుప్పకూలింది. ఇవాళ ఆటకు ఐదో రోజు కాగా, 164-3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 70 పరుగులు మాత్రమే జోడించి 7 వికెట్లు కోల్పోయింది. తద్వారా లంచ్ కు ముందే చేతులెత్తేసింది. 

ఇవాళ్టి ఆటలో కోహ్లీ 49, రహానే 46, కేఎస్ భరత్ 23 పరుగులు చేసి అవుటయ్యారు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 3, స్టార్క్ 2, నాథన్ లైయన్ 4, కమిన్స్ 1 వికెట్ తీశారు. ఇవాళ్టి ఆటలో భారత్ పతనానికి శ్రీకారం చుట్టింది మాత్రం బోలాండ్ అనే చెప్పాలి. ఒకే ఓవర్లో కోహ్లీ, రహానేలను బోలాండ్ అవుట్ చేయడంతో టీమిండియా ఆశలు సన్నగిల్లాయి. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 

కాగా, ఈ విజయంతో ఆసీస్ క్రికెట్ జట్టు అరుదైన ఘనత అందుకుంది. ఐసీసీ నిర్వహించే అన్ని ఫార్మాట్ల మేజర్ ఈవెంట్లలో విజేతగా నిలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అటు భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ మెట్టుపై చతికిలపడడం ఇది రెండోసారి. గతంలో న్యూజిలాండ్ చేతిలోనూ టీమిండియా టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టోమిపాలైంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ వివరాలు...

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 469 రన్స్
ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) సెంచరీలు 
సిరాజ్ కు 4 వికెట్లు
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 296 పరుగులు
రహానే 89, శార్దూల్ ఠాకూర్ 51, జడేజా 48 రన్స్
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 270-8 డిక్లేర్డ్ 
టీమిండియా టార్గెట్ 444 రన్స్
రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 234 ఆలౌట్ 



More Telugu News