లండన్‌లో మండుతున్న ఎండలు.. ప్రిన్స్ ఎదుటే పడిపోయిన సైనికులు!
- లండన్ లో ‘ట్రూపింగ్ ది కలర్’ పరేడ్ రిహార్సల్స్
- ఎండ వేడికి తీవ్ర అలసటకు గురైన సైనికులు.. ముగ్గురికి అస్వస్థత
- సైనికులను అభినందించిన ప్రిన్స్ విలియం
లండన్ లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నిర్వహించిన సైనిక కవాతులో సైనికులు స్పృహ తప్పి పడిపోయారు. ‘ట్రూపింగ్ ది కలర్’ పరేడ్ రిహార్సల్స్ సందర్భంగా ప్రిన్స్ విలియం ఎదుటే ఈ ఘటన జరగడం గమనార్హం. 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం, తీవ్ర అలసటకు గురికావడంతో అస్వస్థతకు గురయ్యారు.
‘ట్రూపింగ్ ది కలర్’ అనేది ఏటా నిర్వహించే పరేడ్. చక్రవర్తి అధికారిక పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రస్తుతం సన్నాహక పరేడ్‌లన్నీ పూర్తయ్యాయి. జూన్ 17న కింగ్ ఛార్లెస్ 3 ఎదుట ‘ట్రూపింగ్ ది కలర్’ అసలు పరేడ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో శనివారం చివరి సన్నాహక పరేడ్ నిర్వహించారు. ట్రాంబోన్ వాయిస్తున్న ఓ సైనికుడు.. ఉన్న చోటనే ఒరిగిపోయాడు. అతడు స్పృహ తప్పిన విషయాన్ని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లారు. చికిత్స అందజేసేందుకు యత్నిస్తుండగానే ఆ సైనికుడు లేచి మళ్లీ ట్రాంబోన్ వాయించాడు.
ముగ్గురు సైనికులు స్పృహతప్పి పడిపోయిన ఘటనపై ప్రిన్స్ విలియం స్పందించారు. ‘‘ఈ ఉదయం అత్యంత వేడిని భరిస్తూ కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడికి ధన్యవాదాలు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు మంచి పనిలో పాల్గొన్నారు. అందుకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు.