ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ హఠాన్మరణం

  • ఇవాళ ఉదయం కుసుమ జగదీశ్వర్ కు గుండెపోటు
  • వెంటనే ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
  • చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఏప్రిల్ 1న కూడా జగదీశ్ కు గుండెపోటు.. నాడు సీపీఆర్ చేసి కాపాడుకున్న భార్య
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ గుండెపోటుతో మృతి చెందారు. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

జగదీశ్వర్‌కు గుండెపోటు ఇదే మొదటి సారి కాదు. ఏప్రిల్ 1న కూడా గుండెపోటుతో కుప్పకూలిపోగా.. ఆయన భార్య రమాదేవి సీపీఆర్ చేశారు. స్పృహలోకి వచ్చిన జగదీశ్వర్ వెంటనే ఆసుపత్రిలో చేరారు. రెండు నెలల తర్వాత మరోసారి గుండెపోటు రావటంతో ప్రాణాలు కోల్పోయారు.

జగదీశ్వర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా జగదీశ్ పోషించిన చురుకైన పాత్రను, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


More Telugu News