ఎన్ని జన్మలు ఎత్తినా ఏపీలో ఒక్క సీటూ గెలవరు.. బీజేపీ నేత జేపీ నడ్డా వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్

  • కర్ణాటకలో మొన్నటి వరకు ఉన్న బీజేపీదే అవినీతి ప్రభుత్వమని విమర్శ
  • ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కాస్తా టీజేపీగా మారిందని ఎద్దేవా చేసిన నాని
  • తెలంగాణలో హరీశ్ రావుకు కేసీఆర్ పై కోపమని ఆరోపణ
  • మామను ఎవరన్నా తిడితే హరీశ్ రావుకు మానసిక సంతోషం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జన్మలు ఎత్తినా బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెల్చుకోలేదని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పేర్ని నాని తేల్చిచెప్పారు. ఏపీలో అవినీతి పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ల్యాండ్ స్కామ్ లకు పాల్పడుతోందని బీజేపీ నేత జేపీ నడ్డా చేసిన ఆరోపణలను పేర్ని నాని తిప్పికొట్టారు. కర్ణాటకలో మొన్నటి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఆ పార్టీకి తెడ్డు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు.

ల్యాండ్ స్కామ్ కు పాల్పడింది ఏపీలో గతంలో అధికారంలో ఉన్న పార్టీయేనని, దానికి బీజేపీ కూడా మద్దతు పలికిందని ఆరోపించారు. విశాఖ ఉక్కును అమ్మేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక కూడా ల్యాండ్ స్కామ్ ఉండి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు పాలనలో ప్రైవేటు వ్యక్తులకు గానీ, సంస్థలకు గానీ ప్రభుత్వ భూములను అమ్మలేదని గుర్తుచేశారు. క్యాప్టివ్ మైన్స్ ను అదానీతో పాటు పలు సంస్థలకు కట్టబెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని పేర్ని నాని తెలిపారు.

ఏపీలోని బడుగు బలహీన వర్గాలను, అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవడానికి జగన్ సర్కారు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమచేస్తోందని పేర్ని నాని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల కింద ఇప్పటి వరకు 2 లక్షల 16 వేల కోట్ల రూపాయలను రాగి పైసా లంచం ఇచ్చే అవసరంలేకుండా పంపిణీ చేశామని వివరించారు. ఇలాంటి విధానం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే చూపించాలని ఆయన జేపీ నడ్డాకు సవాల్ విసిరారు.

రాష్ట్రంలోని పచ్చ నేతలు రాసిచ్చిన ప్రసంగం చదివి వినిపించడం కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు జాగ్రత్తగా జవాబిస్తే మీకూ, మీ పార్టీకి మంచిదని జేపీ నడ్డాకు పేర్ని నాని సలహా ఇచ్చారు. ఏపీలో బీజేపీ మొత్తం పచ్చ నేతలతో నిండిపోయిందని, బీజేపీ కాస్తా టీజేపీగా మారిందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలపైనా పేర్ని నాని స్పందించారు. ఏపీలో ఉన్నది మాటల ప్రభుత్వమేనని హరీశ్ రావు వ్యాఖ్యానించగా.. 2018లో హరీశ్ రావు చేతలు ఎక్కువయ్యాయని స్వయంగా ఆయన మేనమామ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడని గుర్తుచేశారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారని చెప్పారు.

హరీశ్ రావుకు కేసీఆర్ పైన విపరీతమైన దుగ్ధ ఉందని, కేసీఆర్ ను ఎవరైనా తిడితే మానసికంగా సంతోషపడతాడని ఆరోపించారు. హరీశ్ రావు నేరుగా కేసీఆర్ ను తిట్టలేడని, ఎవరైనా తిడితే సంతోషిస్తాడని చెప్పారు. అందుకే వైసీపీ నేతలపై నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తున్నాడని వివరించారు. జగన్ సర్కారుకు హరీశ్ రావు సర్టిఫికెట్లు అవసరంలేదని పేర్ని నాని స్పష్టం చేశారు.


More Telugu News