అప్సర హత్య కేసులో కొత్త ట్విస్ట్

  • అప్సరకు గతంలోనే పెళ్లి జరిగిందనే విషయం వెలుగులోకి
  • ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
  • భర్తతో విబేధాల కారణంగా సరూర్‌నగర్‌‌లోని పుట్టింటికి వచ్చిన అప్సర
  • ఈ క్రమంలోనే సాయికృష్ణతో ప్రేమ, వివాహేతర బంధం..
  • పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు హత్య చేసిన సాయి!
సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరకు గతంలోనే పెళ్లయ్యిందనే విషయం తాజాగా బయటపడింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అతను ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

అప్సరకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అయితే పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. భర్తతో విబేధాల కారణంగా ఏడాది కిందట సరూర్‌నగర్‌‌లోని పుట్టింటికి అప్సర వచ్చిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇద్దరిదీ ఒకే కమ్యూనిటీ కావడంతో అది కాస్త ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే అప్సరను ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి సాయికృష్ణ హత్య చేశాడు.

మరోవైపు అప్సర హత్య కేసులో నిందితుడు సాయికృష్ణను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. జూన్ 22 వరకు అతడు రిమాండ్ లోనే ఉండనున్నాడు. సాయి కృష్ణపై 302, 201 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News