గోల్డ్ స్కీమ్, చీటీల పేరుతో కోట్లల్లో వసూళ్లు.. తిరిగి చెల్లించలేక ఇద్దరు ఆత్మహత్య

  • విజయవాడలోని భవానీపురంలో ఘటన
  • డబ్బులు కట్టిన వారిలో ఆందోళన
  • తెలిసిన వారి దగ్గర లక్షల్లో అప్పులు చేసిన వైనం
  • నష్టాలు రావడం, అనారోగ్యం కారణంగా బలవన్మరణం
నెల నెలా కొంత మొత్తం కడితే 20 నెలల తర్వాత బంగారు నగలు ఇస్తామని మహిళల నుంచి డబ్బులు వసూలు చేశారు.. చీటీల పేరుతో కొంతమంది దగ్గర, ఇంకొందరి దగ్గర లక్షల్లో అప్పులు చేశారు. అవన్నీ తడిసి మోపడవడంతో స్కీంలో చేరిన వారికి నగలు ఇవ్వలేక, చీటీలు పాడుకున్న వారికి, అప్పుల వాళ్లకు తిరిగి చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. విజయవాడలోని భవానీపురంలో శనివారం రాత్రి గోల్డ్ స్కీం నిర్వాహకులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారికి డబ్బులు కట్టిన వారు ఆందోళనకు గురవుతున్నారు.

భవానీపురంలో నేతాజీ స్కూలు రోడ్డులో నివాసం ఉండే దివి తారకరామారావు బంగారం వ్యాపారం చేసేవారు. కొన్నేళ్ల కిందట ఆయనకు తుపాకుల దుర్గాదేవితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి బంగారం స్కీం పేరుతో వ్యాపారం ప్రారంభించారు. నెలనెలా కొంత మొత్తం చెల్లిస్తే బంగారు ఆభరణాలు ఇస్తామని చెప్పారు. గతంలో ఉన్నపరిచయాలతో స్కీంలో చాలామందిని చేర్పించారు. దీంతో పాటు చీటీల నిర్వహణ ద్వారా డబ్బులు వసూలు చేశారు. రానురానూ వ్యాపారంలో నష్టాలు రావడంతో కస్టమర్లకు తిరిగి చెల్లించేందుకు తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేయడం ప్రారంభించారు.

ఇంతలో రామారావు అనారోగ్యం పాలవడం, కస్టమర్లతో పాటు అప్పుల వాళ్లకు చెల్లించాల్సిన సొమ్ము రూ.కోట్లల్లో ఉండడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి రామారావు, దుర్గాదేవి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. బంధువులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో స్కీంలో చేరిన వాళ్లు, చీటీ ఖాతాదారులు, అప్పుల వాళ్లు రామారావు ఇంటివద్దకు చేరుకుని లబోదిబోమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.


More Telugu News