గ్రూప్ 1 పరీక్ష ప్రారంభం.. ఆలస్యంగా వచ్చిన వారికి నో ఎంట్రీ

  • మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న పరీక్ష
  • అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిన అధికారులు
  • పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 994 కేంద్రాల్లో  గ్రూప్ 1 పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 8:30 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. అభ్యర్థులు ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. గతంలోనూ ఈ పరీక్ష నిర్వహించినప్పటికీ పేపర్ లీక్ కారణంగా తాజాగా మరోమారు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఏ రకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. అభ్యర్థులతోపాటు ఇన్విజిలేటర్లు కూడా కేంద్రాల్లోకి ఫోన్ తీసుకువెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా సర్వీసులు నడిపించింది.

ఆలస్యంగా వచ్చి వెనుదిరిగిన పలువురు..
ఉదయం 10:15 గంటలకు అన్ని పరీక్షా కేంద్రాల గేట్లు మూసేసిన అధికారులు.. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల వద్ద చాలా మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చి అధికారులను ప్రాధేయపడడం కనిపించింది. అయితే, రూల్ ప్రకారం ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో లేట్ గా వచ్చిన వారంతా చేసేదేంలేక వెనుతిరిగి వెళ్లిపోయారు.


More Telugu News