ఉచిత విద్యుత్ స్కీం మాకొద్దంటున్న కర్ణాటక ఇంటి యజమానులు.. ఎందుకంటే!

  • ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కుతాయని ఆందోళన
  • ఆదాయపన్ను శాఖ దృష్టిలో పడతామనే టెన్షన్
  • అద్దెకు ఉండే వారికీ కచ్చితంగా చెప్పేసిన యజమానులు
  • ఇంటద్దెలో కొంత డిస్కౌంట్ ఇస్తున్న మరికొంతమంది ఓనర్లు
కర్ణాటకలో కొలువు దీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం ‘గృహ జ్యోతి’ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ పథకం మాకొద్దు పొమ్మంటూ ఇంటి యజమానులు తిరస్కరిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే ఈ మేరకు లెటర్లు కూడా రాసిచ్చారట. అదేంటి, ఈ పథకంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది కదా ఎందుకు వద్దంటున్నారు అని సందేహిస్తున్నారా? ఉచితంగా వస్తుందంటే ఎవరికి చేదు.. కానీ ఈ పథకాన్ని అద్దెకు ఉంటున్న వారికి కూడా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపైనే యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పథకం కోసం అద్దెకు ఉన్న వారు తమ రెంటల్ అగ్రిమెంట్ పేపర్ కానీ, తమ యజమానుల వివరాలు కానీ సమర్పించాలని ప్రభుత్వం నియమం విధించింది. దీనికి ఒప్పుకుంటే తమకు ఎన్ని ఇళ్లు ఉన్నాయి, అందులో అద్దెకు ఇచ్చినవి ఎన్ని, వాటి ద్వారా వచ్చే ఆదాయం ఎంత.. ఇలాంటి వివరాలన్నీ ప్రభుత్వానికి తెలిసి పోతాయి. అధికారికంగా తమ ఆదాయ వివరాలన్నీ రికార్డుల్లోకి ఎక్కుతాయి. దీంతో ఆదాయపన్ను శాఖ దృష్టి తమపై పడే అవకాశం ఉందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకే తమకు ఈ పథకం అక్కర్లేదని చెబుతున్నారు.

బెంగళూరులో ఇంటి అద్దెలు చాలా ఎక్కువని తెలిసిందే. ఇల్లు అద్దెకు దొరకడమే గగనం కావడంతో యజమానులు పెట్టే కండీషన్లు అన్నింటికీ ఒప్పుకుని చేరిపోతుంటారు. యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అద్దెకు ఉండే వారు ఈ పరిణామంతో ఊసురుమంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్కీముకు అర్హత ఉన్నా ప్రయోజనం పొందలేకపోతున్నామని నిట్టూరుస్తున్నారు. అయితే, కొంతమంది యజమానులు మాత్రం కాస్త ఉదారంగా అద్దెలో కొంత మినహాయింపు ఇస్తున్నారట.

ఉచిత విద్యుత్ పథకానికి దూరం చేసినందుకు పరిహారంగా ఇలా ఉదారత్వం ప్రదర్శిస్తున్నారట. ఈ విషయంపై బెంగళూరులో ఐదు ఇళ్లకు యజమాని అయిన మునీశ్ కుమార్ గౌడ మాట్లాడుతూ.. సిటీలో తనకు ఐదు ఇళ్లు ఉన్నాయని, వాటిని అద్దెకు ఇచ్చానని చెప్పారు. నెలనెలా నగదు రూపంలో అద్దె వసూలు చేసుకుంటానని వివరించారు. గృహ జ్యోతి పథకానికి ఒప్పుకుంటే తనకు ఐదు ఇళ్లు ఉన్న విషయంతో పాటు నెలనెలా తనకు వచ్చే అద్దె ఆదాయం వివరాలు ప్రభుత్వానికి తెలిసిపోతాయని, ఐటీ శాఖ దృష్టిలో పడే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల ఐటీ దాడులు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చే ముప్పు ఉందని తెలిపారు. అందుకే తాను ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం లేదని చెప్పుకొచ్చారు.


More Telugu News