కేంద్రం ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా నేడు లక్షమందితో ‘ఆప్’ ర్యాలీ

  • దేశ రాజధానిలో ఉద్యోగుల బదిలీలపై కేంద్రం ఆర్డినెన్స్
  • రామ్‌లీలా మైదానంలో లక్షమందితో ర్యాలీకి సిద్ధమైన ఆప్
  • 12 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించిన కేంద్రం
దేశ రాజధానిలో ఉద్యోగుల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి సర్వహక్కులు కల్పిస్తూ తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ ఆర్డినెన్స్’కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేడు లక్ష మందితో ‘మహా ర్యాలీ’ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ఈ ర్యాలీకి లక్షమంది హాజరవుతారని ఆప్ వర్గాలు తెలిపాయి. 

ఆప్ మహారాల్యీ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. స్థానిక పోలీసులతోపాటు 12 కంపెనీల పారామిలిటరీ బలగాలను వేదిక వద్ద మోహరించింది. ఈ ర్యాలీకి ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ర్యాలీ నేపథ్యంలో ఈ ఉదయం 8 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని కోరుతూ కేజ్రీవాల్ ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి వారిని కలిశారు.


More Telugu News