గెలుపుకు 280 పరుగుల దూరంలో భారత్... ఆశలు రేకెత్తిస్తున్న కోహ్లీ-రహానే జోడీ

  • ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్
  • ముగిసిన నాలుగో రోజు ఆట
  • రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 164-3
  • క్రీజులో కోహ్లీ, రహానే
లండన్ లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ రసవత్తరంగా మారింది. 444 పరుగుల విజయలక్ష్యంతో ఛేదనకు ఉపక్రమించిన టీమిండియా నాలుగో రోజు ఆట చివరికి 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 1, బోలాండ్ 1, లైయన్ 1 వికెట్ తీశారు. 

రేపు ఆటకు చివరి రోజు కాగా, టీమిండియా విజయానికి 280 పరుగుల దూరంలో ఉంది. విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్), అజింక్యా రహానే (20 బ్యాటింగ్) క్రీజులో ఉండడంతో భారత్ గెలుపుపై ఆశలు కలుగుతున్నాయి. అయితే మ్యాచ్ ఐదో రోజున పిచ్ ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారనుంది. 

ఇవాళ టీమిండియా రెండో ఇన్నింగ్స్ చూస్తే... 18 పరుగులు చేసిన యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ మరోసారి త్వరగానే అవుటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ, పుజారా జోడీ క్రీజులో పాతుకుపోయినట్టే కనిపించింది. అయితే 43 పరుగులు చేసిన అనంతరం రోహిత్ శర్మ... స్వీప్ షాట్ కొట్టే యత్నంలో నాథన్ లైయన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే పుజారా (27) కమిన్స్ బౌలింగ్ లో అనవసర షాట్ కు యత్నించి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోరు 3 వికెట్లకు 93 పరుగులు. 

ఈ దశలో కోహ్లీ, రహానే జోడీ అమోఘమైన పట్టుదల కనబర్చి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. చెత్త బంతి పడితే బౌండరీ బాదుతూ స్కోరుబోర్డును ముందుకు కదిలించింది. కోహ్లీ, రహానే అజేయంగా నాలుగో వికెట్ కు 71 పరుగులు జోడించడంతో భారత్ ఫర్వాలేదనిపించే స్థితిలో నిలిచింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 469 పరుగులు  చేయగా, భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా భారత్ ముందు 444 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.


More Telugu News