ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది: సోము వీర్రాజు

  • శ్రీకాళహస్తిలో బీజేపీ సభ
  • హాజరైన జేపీ నడ్డా, సోము వీర్రాజు తదితరులు
  • ఏపీ సర్కారుపై ధ్వజమెత్తిన వీర్రాజు
  • అవినీతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందని విమర్శలు
  • ఎక్కడా అభివృద్ధి అనేదే లేదని వెల్లడి
శ్రీకాళహస్తిలో నిర్వహించిన భారీ సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రసంగించారు. ఏపీలో అవినీతిమయ, అభివృద్ధి రహిత ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన అనేక అంశాల్లో తిలోదకాలు ఇస్తూ, గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ఎక్కడా అభివృద్ధి అనేదే లేకుండా, అవినీతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి వ్యక్తికి రూ.42 విలువైన బియ్యాన్ని ఉచితంగా ప్రతి నెల అందిస్తున్నారని వెల్లడించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ భయపడి... ఒక వ్యాన్ పెట్టి, అందులో తన ఫొటో మాత్రమే పెట్టి ఆ బియ్యం తానే ఇస్తున్నానంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. 

ఇళ్ల నిర్మాణం కోసం మోదీ రూ.1.80 లక్షలు ఇస్తుంటే, ఏపీలో ఆ ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, జగన్ దిగజారుడుతనానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 40 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే అందులో 10 లక్షల ఇళ్లు కూడా పూర్తిచేయలేదని సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వకపోగా, ఆ భూముల కొనుగోలుతో విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 

రైల్వే లైన్లు నిర్మిస్తూ కేంద్రం తన వాటా ముప్పావలా చెల్లిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం పావలా కూడా చెల్లించడంలేదని వివరించారు.


More Telugu News