రహానే ప్రత్యేకత అదే: సునీల్ గవాస్కర్ ప్రశంసలు

  • రహానే సెంచరీలన్నీ టీమిండియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసినవేనన్న గవాస్కర్
  • ‘లో ప్రొఫైల్’తో ఉంటూ.. పరిస్థితిని బట్టి ఆడటం అతడి ప్రత్యేకతని వ్యాఖ్య
  • కామ్‌గా తన బాధ్యతల్లో నిమగ్నమవుతాడని ప్రశంస
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియాను ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు అజింక్య రహానే. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన చోట 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. శార్దూల్ ఠాకూర్ (51), రవీంద్ర జడేజాతో (48)తో కలిసి జట్టు స్కోర్ ను నడిపించాడు. అతడి ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా రహానేను అభినందిస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రహానే ‘ప్రచారం కోరుకోని ఆటగాడు’ అని, తాను ఏం సాధించినా వాటిపై దృష్టిపెట్టకుండా ముందుకు సాగిపోతాడని చెప్పారు. ‘‘సెంచరీ సాధించిన సమయంలోనూ రహానేను చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తాడు. అతడు చేసిన సెంచరీలన్నీ టీమిండియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసినవే. పరిస్థితిని బట్టి ఆడటం అతడి ప్రత్యేకత. ఇలా ‘లో ప్రొఫైల్’తో ఉండే ప్లేయర్ల జాబితాలో రహానే తప్పక ఉంటాడు’’ అని చెప్పారు. 

‘‘సెంచరీ లేదా హాఫ్ సెంచరీ సాధించిన సమయంలో తన ఛాతీని పెద్దదిగా చేసి చూపించడు. కేవలం తన బ్యాట్‌ను మాత్రమే ఎత్తి అభివాదం చేస్తాడు. ఆ తర్వాత కామ్‌గా బాధ్యతల్లో నిమగ్నమవుతాడు’’ అని గవాస్కర్‌ చెప్పారు. రహానేను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ కూడా అభినందించాడు. ‘‘క్రీజ్‌లో రహానే ఇలా యాక్టివ్‌గా కదలడం మునుపెన్నడూ చూడలేదు. అతడి టెక్నిక్‌ సూపర్బ్‌. ఆసీస్‌ బౌలింగ్‌ను కాచుకుని ఆడటం అద్భుతం’’ అని పేర్కొన్నాడు.


More Telugu News