కొండెక్కిన చికెన్ ధరలు.. ఎండల్లానే మండిపోతున్నాయిగా!
- హైదరాబాద్ లో కిలో చికెన్ రూ.315 పైనే
- కోళ్లు చనిపోవడం, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక పెరుగుతున్న ధరలు
- వారం రోజుల్లోనే రూ.50 నుంచి రూ.60 దాకా పెరిగిన రేట్లు
అప్పట్లో ఎండా కాలం వస్తే చికెన్ ధరలు తగ్గేవి. కానీ కొన్నేళ్లుగా ఎండాకాలం వచ్చిందంటే చాలు రేట్లు కొండెక్కుతున్నాయి. ఈ సారి రికార్డు స్థాయికి చేరిపోయాయి. హైదరాబాద్ లో కిలో ధర రూ.300 దాటేసింది. కొన్ని చోట్ల కిలో చికెన్ ధర రూ.315 నుంచి రూ.330 దాకా పలుకుతోంది.
నిజానికి ఎండాకాలంలో వేడి చేస్తుందనే కారణంతో చికెన్ ను కొందరు తినరు. మరోవైపు ఈ ఎండల దెబ్బకి కోళ్లు చనిపోతాయని ఉత్పత్తిని తగ్గిస్తారు. దీంతో సమ్మర్ వచ్చిందంటే రూ.100 నుంచి రూ.150 లోపు మాత్రమే ధరలు ఉండేవి. కానీ కొన్నేళ్లుగా ఎండాకాలంలో ఉత్పత్తి తగ్గుతుంటే.. డిమాండ్ పెరుగుతోంది.
పెరిగిన ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోవడం, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం, దాణా ధరలు పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. శుక్రవారం రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.310 పలుకగా.. శనివారం మరో రూ.10 నుంచి రూ.20 దాకా రేటు పెరిగింది. స్కిన్‌తో ఉన్న చికెన్ కూడా రూ.270–290 వరకు అమ్ముతున్నారు. వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ.50 నుంచి 60 వరకు పెరిగింది. ఇక ఆదివారానికి ఎంత పెరుగుతుందో?