ఆరిపోయిన టీడీపీకి అధ్యక్షుడు.. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు: చంద్రబాబుపై జోగి రమేశ్ విమర్శలు
- చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్న జోగి రమేశ్
- మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపణ
- కొత్తగా పీ-4 అనే మంత్రం అందుకున్నారని, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని ప్రశ్న
ఆరిపోయిన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షుడని ఏపీ మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేవారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ‘‘2014 నాటి టీడీపీ మేనిఫెస్టోలో సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. సబ్సిడీ కూడా ఇస్తానన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు?’’ అని ప్రశ్నించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.14,500 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ‘‘హైస్కూల్ పిల్లలకు సైకిళ్లు ఇస్తానని మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. మొదటి సంతకం చేసిన బెల్టుషాపులు కూడా ఎత్తి వేయలేదు. మంచినీళ్లు ఇవ్వలేదు కానీ ఇంటింటికీ మద్యం సరఫరా చేశారు’’ అని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా పీ-4 అనే మంత్రం అందుకున్నారని, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని ప్రశ్నించారు.
పేదలను ధనవంతులు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడని, పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుకుని కోర్టులకు వెళ్లిన వ్యక్తి ఇప్పుడు ధనవంతులను ఎలా చేస్తారని జోగి రమేశ్ ప్రశ్పించారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అదీ ప్రజల మీద జగన్‌కి ఉన్న ప్రేమ అని చెప్పుకొచ్చారు. పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకున్నది చంద్రబాబేనని మండిపడ్డారు.